ఈసీ తప్పటడుగు వేసిందా?: గుజరాత్‌లో అమల్లోకి రాని ‘కోడ్’.. ఇలా సర్కారీ రాయితీల వరద!!

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించని కేంద్ర ఎన్నికల సంఘం పొరపాటుపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు నిజమేనని అనిపిస్తున్నది. వచ్చేనెల తొమ్మిదో తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే డిసెంబర్‌లోపు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి ఈసీ సరిపెట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా ఈసీ.., ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది.
తద్వారా విజయ్ రూపానీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ రాష్ట్ర ప్రజలకు రాయితీలు ప్రకటించి ప్రలోభ పెట్టేందుకు అవసరమైన మేరకు అదనపు సమయం కేటాయించిందని, తద్వారా ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండా చూసిందని కాంగ్రెస్ పార్టీ పదేపదే విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల జడి నిజమేనన్నట్లు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఒకటి తర్వాత మరొక రాయితీ, పథకం ప్రకటించడంలో బిజీబిజీగా గడుపుతోంది.

వడోదరలో రూ.1,140 కోట్ల విలువైన పథకాలకు నేడు గ్రీన్ సిగ్నల్

వడోదరలో రూ.1,140 కోట్ల విలువైన పథకాలకు నేడు గ్రీన్ సిగ్నల్

కొద్ది రోజుల్లోనే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం పలు అతిపెద్ద ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు ఉద్యోగులకు రాయితీలు ప్రకటించడం ద్వారా రాజకీయ సమీకరణాలను సమతుల్యం చేసే దిశగా చర్యలు చేపట్టింది. గత నెల రోజుల్లోనే గుజరాత్‌లో నాలుగుసార్లు పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం మరో దఫా పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ పర్యటనలో వడోదర ప్రాంతంలో రూ.1,140 కోట్ల విలువైన పలు అభివ్రుద్ధి పథకాలను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ చర్యలు, అభివ్రుద్ది పథకాలను ఒకసారి పరిశీలిద్దాం.

యునైటెడ్ ఫాస్పరస్ సంస్థతో రూ.6000 కోట్లతో ఎంఓడీ

యునైటెడ్ ఫాస్పరస్ సంస్థతో రూ.6000 కోట్లతో ఎంఓడీ

పంట పొలాల్లో ఎరువుల ఉత్పత్తి కోసం యునైటెడ్ ఫాస్పరస్ సంస్థతో రూ.6000 కోట్ల విలువైన మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయు)పై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అభివ్రుద్ది సంస్థ (జీఐడీసీ) సంతకాలు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం విజయ రూపానీ కూడా పాల్గొన్నారు. భారుచ్ జిల్లాలోని దాహెజ్‌లో అగ్రి కెమికల్స్ ఉత్పత్తి చేసేందుకు యునైటెడ్ ఫాస్పరస్ సంస్థ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నది. దీనివల్ల పది వలే మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు. రూ.750 కోట్ల విలువ గల పలు ప్రాజెక్టులు ప్రారంభించడమో, శంకుస్థాపనలో చేసింది. రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో పని చేస్తున్న 15 వేల మంది ఉద్యోగులకు ఏడవ వేతన కమిషన్ కింద ప్రయోజనాలు ప్రకటించిన ప్రభుత్వం.. వారు మరణిస్తే ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

సైన్స్ సిటీలో ఆక్వాటిక్ లైఫ్ సైన్సెస్ రోబోటిక్స్ గ్యాలరీకి శంకుస్థాపన

సైన్స్ సిటీలో ఆక్వాటిక్ లైఫ్ సైన్సెస్ రోబోటిక్స్ గ్యాలరీకి శంకుస్థాపన

ఇక గుజరాత్ రాష్ట్ర రవాణా సంస్థ (జీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశపెట్టదలిచిన 575 బస్సుల్లో 40 సర్వీసులను సీఎం విజయ్ రూపానీ ప్రారంభించారు. ఆయా బస్సుల్లో కండక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పంటల బీమా పథకం అమలుకు నోచుకోవడం సంగతేమిటో గానీ ప్రతి రైతుకు రూ.3 లక్షల చొప్పుల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నిర్ణయం కనీసం 25 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. సైన్స్ సిటీలో అక్వాటిక్ లైఫ్ సైన్సెస్ అండ్ రొబోటిక్స్ గ్యాలరీ నిర్మాణానికి గుజరాత్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.

తొలిసారి డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్

తొలిసారి డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్

17 ఏళ్ల క్రితం ప్రతిపాదన రాగా, తొలిసారి అమ్రేలీ జిల్లాలోని అంబార్డీలోని లయన్ సఫారీ పార్క్‌ను ప్రజల సందర్శన కోసం తెరిచి పెట్టాలని నిర్ణయించింది. నల్కంటా ప్రాంతంలో రైతులపై హోంశాఖ నమోదు చేసిన 22 కేసులను ఉపసంహరించుకున్నది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన పాటిదార్లపై 468 కేసులను ఉపసంహరించింది.
21 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్లు కల్పించింది. గుజరాత్ రాష్ట్ర చరిత్రలో డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్లు కల్పించడం ఇదే మొదటిసారి. అలా ప్రమోషన్ అందుకున్న 21 మంది డీఎస్పీల్లో ఎనిమిది మంది పాటిదార్లు కావడం గమనార్హం.

ఈసీ తీరుపై మాజీ ప్రధాన కమిషనర్ ఖురేషి ఇలా

ఈసీ తీరుపై మాజీ ప్రధాన కమిషనర్ ఖురేషి ఇలా

ఒకవేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తే తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి వస్తుంది. తద్వారా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ రాయితీలు ప్రకటించే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటి వరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషీ ఒక ఆంగ్ల దిన పత్రికలో రాసిన వ్యాసంలో పలు వైపుల నుంచి విమర్శలు కొని తెచ్చుకున్నదని వ్యాఖ్యానించారు. ‘ఒకవేళ ప్రభుత్వం నూతన ప్రజాదరణ పథకాలు, ఉచిత పథకాలు ప్రకటిస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పి కానున్నది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అమలులోకి రావడానికి గుజరాత్‌లో మరికొన్ని రోజులు వెసులు బాటు కల్పించినట్లే. ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘానికి గల స్వతంత్ర ప్రతిపత్తి, పేరు ప్రతిష్ఠలకు మచ్చ తెచ్చుకున్నట్లే. భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్లే' అని
వ్యాఖ్యానించారు.

 ఈసీ గుర్తింపు కోసం ఏళ్లకు ఏళ్లకు టైమ్ ఇలా

ఈసీ గుర్తింపు కోసం ఏళ్లకు ఏళ్లకు టైమ్ ఇలా

‘కేంద్ర ఎన్నికల సంఘం తనకు కల్పించిన చట్టబద్ధ అధికారాలతో ఎన్నికలు నిర్వహిస్తే ఈసీకి స్వతంత్రత, గ్యారంటీ లభిస్తుంది. కేవలం భారతదేశంతోపాటు అంతర్జాతీయంగా అటువంటి పేరు ప్రతిష్ఠలు లభించాయి. గుర్తింపు రావడానికి ఏళ్లకేళ్లు పడితే ధ్వంసం చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే చాలు' అని కూడా ఖురేషీ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోవడంతో ఎన్నికల సంఘం విపక్ష పార్టీల విమర్శల పాలవుతున్నదని ఖురేషీ వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషర్ అచంట కుమార్ జ్యోతి అనుసరించిన విధాన నిర్ణయాలు బాధాకరంగా మారాయి. ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విషయమై కేంద్రంలోని అధికార పార్టీ, ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయిన కేంద్ర ఎన్నికల సంఘం.. అధికార బీజేపీకి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజలు, పార్టీల ఆందోళనలు నిజమేనని నిరూపించింది. ప్రభుత్వం రాయితీలు ప్రకటించేందుకు ఎన్నికల కోడ్ అమలుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది' అని ఎస్ వై ఖురేషీ పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gandhinagar: The Congress seems to be right in its criticism against the Election Commission (EC) for deciding not to announce the Assembly elections dates for Gujarat. Recently, when the EC declared that the Himachal Pradesh Assembly elections will be held on November 9, the commission just stated that the Assembly polls in Gujarat will be organised in December without declaring the specific date/dates.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి