గ్రామీణంలో రాహుల్ సక్సెస్ సరే!: అర్బన్‌లో కమలానిదే పట్టు
న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌లో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. ఒకవైపు అధికార బీజేపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా.. దాన్ని అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటనలకు భారీ ప్రజాదరణ లభిస్తుండటంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం, ఆనంద డోలికల మధ్య సాగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తన పరిస్థితిని మెరుగు పర్చుకునేందుకు కష్ట పడుతున్నా తప్పుడు అంచనాలతో ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నాలుగుసార్లు గుజరాత్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ.. తాజాగా గాంధీ నగర్ ప్రాంతంలో పర్యటించారు. ఉత్సాహ పూరిత, అనుకూల వాతావరణం కనిపిస్తున్నా వివిధ అంశాలు, సమీకరణాలతో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికార బీజేపీతో తలపడటం పోటాపోటీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకుముందు సీఎంగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగానే ఉన్నది. కానీ ఈ ఏడాది ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయం తర్వాత 'హస్తం' పార్టీ దూకుడుగా పురోగమిస్తోంది.
Recommended Video

గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడిగా శంకర్ సింఘ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి.. అహ్మద్ పటేల్ ఓటమికి శతవిధాల ప్రయత్నించారు. అహ్మద్ పటేల్‌ను ఓడించడం ద్వారా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వేసిన వ్యూహం విఫలమైంది. సాంకేతిక కారణాలపై ఈసీ తీసుకున్న నిర్ణయం మేరకు అహ్మద్ పటేల్ విజయం సాధించి కమలనాథులపై ఆధిపత్యం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత శంకర్ సింఘ్ వాఘేలా నిష్ర్కమణ, అహ్మద్ పటేల్ విజయం గుజరాత్ రాజకీయాలను పున:లిఖించాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాఘేలా నిష్క్రమణతో కాంగ్రెస్‌లో సంతోషం ఇలా
ప్రస్తుతం ఓబీసీ కోటాలో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తొలి నుంచి అండగా ఉన్న పాటిదార్లు ఈ ఎన్నికల్లో బీజేపీకి దూరం కావడంతో ‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం' తన అస్త్రశస్త్రాలకు పరీక్షగా నిలుస్తుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు. ఇక బీజేపీకి గల ప్రతికూల పరిస్థితులు విపక్ష కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తున్నది. వాఘేలా నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో రాహుల్ పర్యటనలకు ప్రజలు ఉత్సాహపూరితంగా హాజరవుతున్నారు. అహ్మదాబాద్ జిల్లా సబర్మతి రివర్ ఫ్రంట్ సమీపాన ప్రజలతో ఇష్టాగోష్టిగా సమావేశం, సౌరాష్ట్ర ప్రాంతంలో ద్వారకా పట్టణం మీదుగా చోటియా పట్టణంలో పర్యటన, సెంట్రల్ గుజరాత్ రాష్ట్రంలో మంచి సంకేతాలనిచ్చాయి. ఈ పర్యటనలు కాంగ్రెస్ పార్టీకి మంచి మిశ్రమ ఫలితాలను అనుభవంలోకి తెచ్చాయి.

గుజరాత్ గౌరవ్ యాత్రకు స్పందన అంతంతే
ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన ద్వారా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజల స్పందన ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు రాహుల్ పర్యటనలు ఉపయోగపడ్డాయి. అంతే కాదు రాహుల్ గాంధీ పరిణతి సాధించిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. ద్వారకా, చోటియా నగరాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన పరిణతిని రుజువు చేసుకున్నారు. యువతను వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, అమిత్ షా తనయుడు జయ్ షా వ్యాపార లావాదేవీల్లో టర్నోవర్ అవకతవకలు తదితర అంశాలు ప్రస్తావిస్తూ ఆయా వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ సంక్షోభం నెలకొన్న ప్రాంతాల్లో నర్మదా యాత్ర, గుజరాత్ గౌరవ్ యాత్ర చేపట్టిన బీజేపీకి మోస్తరు స్పందన మాత్రమే లభించడం కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది. 2002 గోద్రా రైలు దగ్ధం తర్వాత నాటి సీఎంగా నరేంద్రమోదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘గుజరాత్ ఆత్మగౌరవ' యాత్ర సత్ఫలితాలు తెచ్చి పెట్టింది. ఈ సారి కూడా అదే స్థాయిలో ఫలితాలు సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు.

నాడు ఇందిర.. నేడు మోదీపై ద్వేషం ఇలా
అయితే క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రబలంగా పెరుగుతున్న ప్రజాదరణ విశ్వాసం పెంపొందిస్తుండగా, అధికార బీజేపీ మాత్రం రోజురోజుకు ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నది. భారతదేశంలో శక్తిమంతులైన రాజకీయ నాయకులపై ద్వేషం ప్రదర్శించే వారు ఉన్నారు. ఇంతకుముందు గతంలో ఇందిరాగాంధీ, తాజాగా నరేంద్రమోదీ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాదిరిగానే ప్రస్తుత ప్రధాని మోదీ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు నేతల పరిపాలనా తీరుతో పోలిస్తే చాలా తేడాలు కనిపిస్తాయి.

సీఎంలుగా ముద్ర వేయలేకపోయిన ఆనందీబెన్.. విజయ్ రూపానీ
గుజరాత్ రాష్ట్రంలో ప్రజల నాడిని పసిగట్టిన ప్రధాని నరేంద్రమోదీ విజయంపై కచ్చితమైన నమ్మకం కలిగి ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ హస్తినకు వెళ్లినప్పుడు ఆయన వారసురాలిగా సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆనందీబెన్ పటేల్ మొండి పట్టుదల గల వారని విమర్శలు ఉన్నాయి. కానీ ఆమె తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ రూపానీ మంచి వ్యక్తి అని పేరు ఉన్నవారు. అంతే కాదు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత సన్నిహితుడన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాని మోదీతో పోలిస్తే ఆనందీబెన్ పటేల్, విజయ్ రూపానీ పనితీరు ప్రజలపై అంత బలమైన ముద్ర వేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.

బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ దేశ రాజధాని ‘హస్తిన'కు తరలి వెళ్లిన తర్వాత అధికార బీజేపీని సమస్యలు వెంటాడాయి. రిజర్వేషన్ల కోసం పాటిదార్ల ఆందోళన, ఓబీసీల హక్కుల పోరాటం, దళితుల నిరసన జ్వాల.. మోదీ నాయకత్వాన్ని సవాల్ చేసే స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు యంగ్ టర్కులు హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీల దూకుడు, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు కమలనాథులకు క్లిష్ట పరిస్థితులు తెచ్చి పెట్టాయి. అధికార బీజేపీతో పోలిస్తే ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా, సంతోషంగా ముందుకు సాగుతున్నది. కానీ ప్రధాని నరేంద్రమోదీ కంటే మెరుగ్గా అధికార బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యలు కమలనాథులకు తెలియదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రజలకు మరోసారి ప్రధాని మోదీ భావోద్వేగ పిలుపు
ఆదివారం వడోదరలో జరిగిన ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభకు హాజరైన వారిలో స్థానికులంటే ఇతర ప్రాంతాల వారే ఎక్కువ అని ఒక బీజేపీ నేత గుర్తు చేశారు. అధికార బీజేపీలోని పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు తాను అద్భుతాలు స్రుష్టించే అవకాశాలే లేవు. అందుకే తనను ద్రుష్టిలో పెట్టుకుని ఓటేయాలని గుజరాతీలకు ప్రధాని మోదీ పిలుపునిస్తున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒక పార్టీ అధికారంలో ఉండాలని అప్పుడే ప్రగతి సాధించగలమని, అద్భుతాలు సాధించగలమన్న వాదనతో గుజరాతీలతో భావోద్వేగ పూరిత వాతావరణాన్ని కల్పించడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది గుజరాతీలకు మన:స్సాక్షిగా ప్రతిస్పందించాలని చివరిసారిగా భావోద్వేగ పూరితంగా పిలుపునిస్తున్నారు.

ఆరు నగర పాలక సంస్థల్లోనూ బీజేపీదే హవా
పాటిదార్ల ఆందోళన నేపథ్యంలో 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని కాంగ్రెస్ పరిగణిస్తున్నది. కానీ దేశవ్యాప్తంగా గల పట్టణ పునాది కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నది. మరోవైపు బీజేపీ అహ్మదాబాద్, వడోదర, రాజ్ కోట్, సూరత్, జామ్ నగర్, భావ్ నగర్ నగర పాలక సంస్థల్లో విజయం సాధించడం గమనించదగ్గ పరిణామం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దశలో గ్రామీణ, సెమీ పట్టణ ప్రాంతాల ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న సంగతి అర్థమైంది. పట్టణ వాసులు కూడా నిరాశతో ఉన్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల తేడా 9 శాతంగా ఉన్నది. బీజేపీకి 47.9 శాతం, కాంగ్రెస్ పార్టీకి 38.9 శాతం ఓట్లు లభించాయి. ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో కమలనాథులు పట్టు కలిగి ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతున్నది.

విజయంపై ప్రధాని మోదీకి భారీగానే ఆశలు
అయితే గుజరాత్ రాష్ట్రంలో తదుపరి అధికారంలోకి ఎవరు రావాలన్నది నిర్దేశించేది మాత్రం గాంధీనగర్ జిల్లా మాత్రమే. దీని పరిధిలోని 40 - 45 స్థానాల్లో విజయం ఎవరిదన్న సంగతే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్నది తేలుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోదీకి భారీగానే ఆశలు ఉన్నాయి. కానీ గుజరాత్‌లో బీజేపీ ఓటమి పాలైతే మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రధాని మోదీ ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications