వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Income Tax Returns: ఎలా ఫైల్ చేయాలి, మనకు రావాల్సిన డబ్బును ఎలా తీసుకోవాలి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కంప్యూటర్ ముందు ఆలోచిస్తున్న అమ్మాయి

'హలో ఫ్రెండ్స్! ఎవరైనా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా? తెలిసిన వాళ్లు కాస్త చెబుదురూ... అసలే వచ్చే ముప్పై ఒక్కటే లాస్ట్ డేటంట.'

'అక్కా నాకిదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడూ ట్యాక్స్ కట్టలే. రిటర్న్స్ కోసం నేను ఏ ఫాం ఫిల్ చేయలే?'

ప్రతి ఏడాది జులై నెలలో ఇలాంటి సంభాషణలు తరచూ వింటుంటాం. ఇదిగో ఇలా గడువు ముంచుకొస్తున్నప్పుడు ఆ హడావిడి ఇంకా ఎక్కువ. తొలిసారి రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్లది ఒకరకమైన కంగారైతే... ఎన్నిసార్లు చేసినా ప్రతిసారీ కొత్తగానే ఫీలవుతూ ఆందోళనపడే వాళ్లను చూస్తుంటాం.

తొలిసారి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే వచ్చే డౌట్లు బోలెడు. ఎంచుకోవాల్సిన ఫాం దగ్గర నుంచి దాన్ని ఫిల్ చేయడం వరకు సవాలక్ష సందేహాలు బుర్రలో మెదులుతుంటాయ్.

భారత ఆదాయపు పన్ను విభాగం

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ అంటే ఏంటి?

మనకు వచ్చే ఆదాయం, కట్టే పన్నుకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించే ఫామ్‌నే ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ అంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం మీద ఆ తరువాత ఆర్థికసంవత్సరంలో రిటర్నులు దాఖలు చేయాలి.

సాధారణంగా జులై 31లోపు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకోసారి ఈ గడువును పొడిగిస్తుంటారు. కానీ ఈ సారి గడువు పెంచేది లేదని ప్రభుత్వం చెబుతోంది.

నేను ఏ ఫాం ఎంచుకోవాలి?

తొలిసారి రిటర్నులు దాఖలు చేసే వాళ్లకు ఈ సందేహం వస్తుంది. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఐటీఆర్-1, ఐటీఆర్-2... ఇలా అనేక రకాల ఫామ్స్ కనిపిస్తుంటాయి. ఎవరు ఏ ఫాం ఫిల్ చేయాలో చూద్దాం...

ఐటీఆర్-1

దీన్నే సహజ్ అని కూడా అంటారు. వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉండే వాళ్లు ఐటీఆర్-1 ద్వారా రిటర్న్స్ ఫైల్ చేయాలి. జీతం, పెన్షన్, ఇంటి ద్వారా వచ్చే ఆదాయం, వ్యవసాయ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్ అంటే స్టాక్ మార్కెట్‌ ద్వారా వచ్చే లాభాలు, లాటరీ, రేసు గుర్రాల మీద కాసే పందేలా ద్వారా వచ్చే ఆదాయం వంటివి ఉన్నవారు ఐటీఆర్-1 దాఖలు చేయాలి.

ఐటీఆర్-2

ఏడాదికి రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వాళ్లు దీని కిందకు వస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు జీతం, పెన్షన్, క్యాపిటల్ గెయిన్స్, లాటరీ వంటి వాటి ద్వారా వచ్చే వార్షిక ఆదాయం రూ.50 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఈ ఫాం ఎంచుకోవాలి.

ఐటీఆర్-3

బిజినెస్ లేదా ప్రొఫెసన్ ద్వారా వచ్చే లాభాలు, ప్రయోజనాల రూపంలో ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు ఐటీఆర్-2 ద్వారా ఫైల్ చేయాలి.

ఐటీఆర్-4

దీన్నే సుగం అని అంటారు. ఎంత ఆదాయం వస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని వ్యాపారులు, ప్రొఫెషనల్స్ ఈ ఫాం ఎంచుకోవచ్చు. వ్యాపారుల విషయంలో రూ.2 కోట్లు, ప్రొఫెషనల్స్ విషయంలో రూ.50 లక్షల కంటే వార్షిక ఆదాయం మించకూడదు.

ఇంజినీర్లు, లాయర్లు, అకౌంటాట్స్, డాక్టర్స్ వంటి వారు ప్రొఫెషనల్ వ్యక్తుల కిందకు వస్తారు.

ఐటీఆర్-5

ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, వ్యాపార ట్రస్టులు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, లిమిటెడ్ లయబిలిటీ ఫామ్స్ వంటి ఐటీఆర్-5 కిందకు వస్తాయి.

ఐటీఆర్-6

ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్-11 కింద మినహాయింపులు కోరని కంపెనీలు ఈ ఫాం ఫిల్ చేయాలి. దాతృత్వ, మతపరమైన కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుల నుంచి వచ్చే ఆదాయం మీద సెక్షన్-11 కింద మినహాయింపు ఉంటుంది.

ఐటీఆర్-7

ట్రస్టుల ద్వారా ఆదాయం పొందేవారితోపాటు రాజకీయ పార్టీలు, ఆసుపత్రులు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, వార్తా సంస్థలు వంటివి ఈ కేటగిరిలోకి వస్తాయి.

సాధారణ ఉద్యోగుల జీతాలు రూ.50 లక్షల లోపే ఉంటాయి కాబట్టి, ఎక్కువ మందికి ఐటీఆర్-1 వర్తిస్తుంది.

ఆదాయపు పన్న రిటర్నుల దాఖలు చేస్తున్న వ్యక్తి

ఏ డాక్యుమెంట్స్ కావాలి?

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఫాం-16 దగ్గర పెట్టుకోవాలి. ఆదాయపు పన్ను విభాగం పాన్ ఆధారంగా కొన్ని అంశాలను ముందుగానే ఫిల్ చేసి ఉంచుతుంది. https://www.incometax.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత ఖాతాలోకి లాగిన్ అయినప్పుడు ఆ వివరాలు కనిపిస్తాయి. ముందుగానే ఫిల్ చేసిన వివరాలు, ఫా-16తో సరిపోతున్నాయో లేదో చూసుకోవాలి.

ఫాం-16 అంటే?

ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగికి ఇచ్చిన జీతం, టీడీఎస్ రూపంలో కట్ చేసిన పన్ను వివరాలు తెలిపేదే ఫాం-16. కంపెనీలు ఉద్యోగులకు ఈ ఫాం ఇస్తాయి. ఉద్యోగి వద్ద ఎంత పన్ను కట్ చేశారు? ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఎంత జమ చేశారు? వంటి వివరాలు ఇందులో ఉంటాయి.

టీడీఎస్ అనగా?

టీడీఎస్... ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్... అంటే ఆదాయం వచ్చినప్పుడే పన్ను కట్ చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉద్యోగులకు వచ్చే జీతం. నెలనెలా జీతం ఇచ్చేటప్పుడే ట్యాక్స్ కట్ చేసి ఇస్తారు.

రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలి?

భారత్‌లో ఏడాదికి రూ.2.5 లక్షల వరకు సంపాదించే వారు పన్ను కట్టనక్కర్లేదు. రూ.2.5 లక్షలపైన ఆదాయం వచ్చే వాళ్లు పన్ను పరిధిలోకి వస్తారు. అలా పన్ను పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి.

రీఫండ్స్ పొందడానికి కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది?

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు రావొచ్చు.

గడువులోపు చేయకపోతే?

గడువులోపు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది. జులై 31లోపు ఫైల్ చేయని వారు పెనాల్టీ కట్టడం ద్వారా డిసెంబరు 31లోపు దాఖలు చేయొచ్చు. ఆదాయాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు ఫైన్ వేస్తారు.

జులై 31 తరువాత పన్ను బాకీ ఉంటే దాని మీద 1శాతం వడ్డీ కూడా వేస్తారు. రిటర్న్స్ ఫైల్ చేసి పన్ను చెల్లించే వరకు వడ్డీ పడుతూనే ఉంటుంది.

పన్ను ఎగవేతల విషయంలో 100శాతం పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ మీద అదనంగా వడ్డీ కూడా పడుతుంది.

రిటర్న్స్ విషయంలో చేసే 5 తప్పులు

గడువులోపు ఫైల్ చేయలేక పోవడం: ప్రస్తుతానికైతే జులై 31లోపు రిటర్న్స్ ఫైల్ చేయాలి. గడువులోపు పూర్తి చేయకపోతే ఐటీ డిపార్ట్‌మెంట్ జరిమానా విధిస్తుంది. రూ.10 వేల వరకు పెనాల్టీ వేయడంతోపాటు ప్రభుత్వానికి బాకీ పడిన పన్ను మీద అదనంగా ఒకశాతం వడ్డీ వేస్తుంది.

వివరాలు సరిగ్గా లేకపోవడం: రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పాన్ కార్డ్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీ, పుట్టిన రోజు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఈ వివరాలు సరిగ్గా లేకపోతే ఐటీఆర్ ఫాంను అధికారులు రిజెక్ట్ చేయొచ్చు లేదా ప్రాసెస్ ఆలస్యం కావొచ్చు.

రిటర్న్ ఫైల్ చేయకపోవడం: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోవడం వల్ల లీగల్ సమస్యలు ఎదురవుతాయి. నోటీసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

క్యాపిటల్ గెయిన్స్ వివరాలు ఇవ్వకపోవడం: షేర్లు, స్థిరాస్తులు వంటి వాటి ద్వారా వచ్చే మూలధన లాభాలు లేదా నష్టాల సమాచారాన్ని తప్పకుండా రిటర్న్స్‌లో చూపించాలి. లేదంటే ట్యాక్స్ ఆడిట్ జరుగుతుంది.

ఐటీఆర్ ఫాంను వెరిఫై చేయకపోవడం: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన తరువాత ఆ ఫాంను తప్పనిసరిగా వెరిఫై చేయాలి. పన్ను చెల్లింపుదారులు వెరిఫై చేస్తేనే ఐటీ అధికారులు ప్రాసెస్ మొదలుపెడతారు. రిటర్న్స్ ఫైల్ చేసిన 120 రోజుల్లోపు వెరిఫికేషన్ పూర్తి కావాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని చార్టర్డ్ అకౌంటెంట్ హనుమారెడ్డి తెలిపారు. నేడు మనం చేసే ప్రతి ఆర్థిక లావాదేవీని ఐటీశాఖ రికార్డు చేస్తోందని, అందువల్ల చిన్న తేడా వచ్చిన వారు పసిగడతారని వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం...

  • అన్నింటికంటే ముందు ఆదాయం సరిచూసుకోవాలి. పాన్ కార్డు ఉన్న వారి ఆర్థికలావాదేవీలన్నింటినీ ఐటీశాఖ రికార్డ్ చేస్తూ ఉంటుంది. https://www.incometax.gov.in వెబ్‌సైట్‌లో Services అనే సెక్షన్‌లోకి వెళితే Annual Information System(AIS) అనే విభాగంలో ఆర్థిక లావాదేవీలన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి.
  • ఏఐఎస్‌లో రికార్డ్ అయ్యే ఆర్థిక లావాదేవీలు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే వెంటనే ఐటీ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయాలి.
  • ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఆధార్‌తో పాన్ లింక్ అయి ఉంటే ఇది సాధ్యమవుతుంది. లేదంటే కాదు.
  • రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సరిగ్గా ఫిల్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. ఇచ్చిన సమాచారంలో లేదా ఆదాయంలో ఏమైనా తేడాలు ఉంటే ఆటోమేటిక్‌గా వివరణ కోసం నోటిసు వస్తుంది. ఆ నోటిసుకు తగిన సమయంలో సమాధానం ఇవ్వకపోతే ఆ తరువాత డిమాండ్ నోటిసు పంపిస్తారు.
  • మరొక ముఖ్యమైన అంశం... సకాలంలో రిటర్న్స్ ఫైల్ చేయడం. గడువు ముంచుకొచ్చే వరకు ఆగి, చివరి నిమిషంలో చేయడం వల్ల సమస్యలు వస్తాయి. ఎక్కువ మంది ఫైల్ చేసేందుకు ప్రయత్నించడం వల్ల సర్వర్ల మీద భారం పడి మొరాయిస్తాయి. అలాగే హడావుడిగా ఫైల్ చేసే సమయంలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది.
లెక్కలు వేస్తున్న వ్యక్తి

నేను ఎక్కువ పన్ను కట్టాను రీఫండ్ ఎలా?

పన్ను రూపంలో కట్టిన డబ్బు వెనక్కి వస్తే దాన్ని రీఫండ్ అంటారు. కట్టాల్సిన పన్ను కంటే ఎక్కువ కట్టినప్పుడు లేదా ముందస్తు పన్ను కట్టిన సందర్భాల్లో రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.

ట్యాక్స్ సేవింగ్స్ కోసం జీవిత బీమా, ఆరోగ్యబీమా, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, ఎన్‌పీఎస్ వంటి వాటిలో మదుపు చేస్తుంటారు.

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులు ట్యాక్స్ సేవింగ్స్ ప్రపోజల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనల ఆధారంగా సంవత్సరం మొత్తానికి మీరు కట్టాల్సిన పన్నును లెక్కిస్తారు. ఆ తరువాత నెలనెలా కొంత టీడీఎస్ రూపంలో కట్ చేస్తారు.

ఉదాహరణకు A అనే వ్యక్తికి సంవత్సరానికి రూ.9 లక్షల జీతం వస్తోంది. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు 80సీ కింద రూ.1.5 లక్షలు, ఎన్‌పీఎస్ కింద రూ.50 వేలు పొదుపు చేస్తున్నారు. వీటికి స్టాండర్డ్ డిడక్షన్, పీఎఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ వంటివి అదనం. మొత్తం మీద రూ.3 లక్షల వరకు మినహాయింపు వస్తోందని అనుకుందాం. అంటే రూ.6 లక్షల నికర ఆదాయం మీద A పన్ను కట్టాలి.

రూ.6 లక్షల నికర ఆదాయం మీద రూ.32,500 పన్ను కట్టాలి. దీనికి హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ కలిపితే మొత్తం కట్టాల్సిన పన్ను రూ.33,800. దీనికి తగినట్లుగా నెలనెలా టీడీఎస్ వసూలు చేస్తారు.

ఒకవేళ A, 80సీ కింద రూ.లక్షకు మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చారు. అప్పుడు ట్యాక్సబుల్ ఇన్‌కం రూ.6.5 లక్షలు అవుతుంది. దాంతో కట్టాల్సిన ట్యాక్స్ రూ.44,200కు పెరుగుతుంది. కానీ ఆ తరువాత A రూ.50 వేలు పొదుపు చేశారు.

ఈ కేసులో ట్యాక్స్ సేవింగ్ ప్రపోజల్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల రూ.10,400 ఎక్కువ పన్ను కట్టారు A. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ డబ్బును A రీఫండ్ కోరవచ్చు.

రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో రూ.50 వేలను 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.50 వేలకు సంబంధించిన రిసిప్ట్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వస్తే ఆ రిసిప్ట్ చూపించాల్సి ఉంటుంది.

ల్యాప్ టాప్‌లో ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వ్యక్తి

ఎలా ఫైల్ చేయాలి?

  • ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు https://www.incometax.gov.in లోకి వెళ్లాలి.
  • Dashboardలో మీకు ఆటోమేటిక్‌గా రిటర్న్స్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. లేదంటే e-File సెక్షన్‌లోకి వెళ్లి Income Tax Return మీద క్లిక్ చేసి File Income Tax Return సెలెక్ట్ చేసుకోవాలి.
  • తరువాత Select Assessment Year మీద క్లిక్ చేసి 2022-23(Current A.Y)ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • Select Mode of Filing కేటగిరిలో Online చూజ్ చేసుకోవాలి.
  • Individual... HUF(Hindu Undivided Family)... Othersలలో ఒకదాన్ని ఎంచుకోవాలి.
  • Select ITR Form మీద క్లిక్ చేసిన మనకు తగిన ఐటీఆర్ ఫాంను సెలెక్ట్ చేసుకోవాలి. మాములు ఉద్యోగులకైతే ఐటీఆర్-1 వర్తిస్తుంది.
  • నచ్చిన ఐటీఆర్ ఫాం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళితే... మనకు 5 సెక్షన్లు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు సమాచారం ముందుగానే ఫిల్ చేసి ఉంటుంది.

1.Personal Information

ఇందులో ట్యాక్స్ పేయర్ వివరాలు ఉంటాయి. పేరు, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నెంబరు, ఇ-మెయిల్ ఐడీ వంటివి ఉంటాయి. వీటిని ఒక సారి చూసి చెక్ చేసుకోవాలి.

ఒకవేళ రీపండ్ రావాల్సి ఉంటే బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా సరి చూసుకోవాలి.

2.Gross Total Income

ఇందులో పన్ను చెల్లింపుదారుకు వచ్చిన మొత్తం ఆదాయం, మినహాయింపుల వివరాలుంటాయి.

జీతం, ఇల్లు, డివిడెండు, వడ్డీలు, క్యాపిటల్ గెయిన్స్ వంటి మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని చూపించాలి.

అలాగే మినహాయింపు ఉన్న ఆదాయాన్ని కూడా పొందుపర్చాలి.

3.Total Deductions

ఈ సెక్షన్‌లో 80సీ, 80డీ, 80జీ వంటి ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి.

ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, వైద్యం ఖర్చులు, ఆరోగ్యబీమా, విద్య కోసం తీసుకున్న రుణం, హోం లోన్, డొనేషన్స్ వంటివి ఇందులో ఉంటాయి.

4.Tax Paid

ఇందులో ఉద్యోగుల వద్ద టీడీఎస్ రూపంలో కట్ చేసిన పన్ను వివరాలుంటాయి. అలాగే ముందస్తు పన్ను కట్టి ఉంటే ఆ సమాచారం కూడా ఉంటుంది.

5.Total Tax Liability

ఇది చివరి సెక్షన్. ట్యాక్స్ పేయర్ ఆదాయం, పన్ను మినహాయింపులు, డిడక్షన్స్, టీడీఎస్ పోను ఇంకా ఎంత పన్ను కట్టాలో ఇక్కడ చెబుతారు.

ఒకవేళ టీడీఎస్ లేదా ముందస్తు పన్ను ఎక్కువ కట్టి ఉంటే రావాల్సిన రీఫండ్ వివరాలుంటాయి.

ఈ అయిదు సెక్షన్లు ముందుగానే నింపి ఉంటాయి. మనం చేయాల్సిందల్లా వాటిని చెక్ చేసి, ఫాం-16తో సరి చూసుకోవడమే.

ఆ తరువాత ఒకసారి మొత్తం వివరాలను చెక్ చేసుకొని Submit చేయాలి. Submit చేసే ముందు ఒకటికి రెండు సార్లు వివరాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే Submit చేశాక మళ్లీ మార్పులు చేర్పులు చేయలేరు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం

ఇక చివరిగా చేయాల్సిన ముఖ్యమైన పని ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫాంను వెరిఫై చేయడం.

ఆధార్: ఐటీఆర్‌ను ఆధార్ ద్వారా వెరిఫై చేయొచ్చు. ఇందుకు ఆధార్, పాన్ రెండు లింక్ అయి ఉండాలి. ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉండాలి. Income Tax Return సెక్షన్‌లోకి వెళ్లి 'e-verify return'లో ఆధార్‌ ద్వారా వెరిఫై చేసుకునే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆధార్‌కు లింకైన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.

నెట్ బ్యాంకింగ్: 'e-verify return'లోకి వెళ్లి 'Through Net Banking' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత మీ బ్యాంక్‌కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లాలి. అక్కడ సాధారణంగాTax అనే ట్యాబ్ కింద్ 'e-verify' అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అది ఐటీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. అక్కడ సంబంధిత ఐటీఆర్ ఫాంను చూజ్ చేసుకుని 'e-verify' మీద క్లిక్ చేయాలి.

బ్యాంక్ అకౌంట్: 'e-verify return'లోకి వెళ్లి 'Through Banking' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్(ఈవీసీ), రిజిష్టర్డ్ మొబైల్ నెంబర్‌, ఇ-మెయిల్ ఐడీలకు వస్తుంది. ఈవీసీని ఎంటర్ చేస్తే వెరిఫై పూర్తవుతుంది.

డీమ్యాట్ అకౌంట్: 'e-verify return'లోకి వెళ్లి 'Through Dmat Account' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కూడా బ్యాంక్ అకౌంట్ మాదిరే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ పూర్తి అవుతుంది.

బ్యాంక్ ఏటీఎం: కొన్ని బ్యాంకులు ఏటీఎం ద్వారా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌ను వెరిఫై చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

మీ బ్యాంకు ఏటీఎంకు వెళ్లి, డెబిట్ కార్డు స్వైప్ చేయాలి. ఆ తరువాత Generate EVC అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈవీసీ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. దీన్ని ఎంటర్ చేయడం ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోతుంది.

వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి అయితే అందుకు సంబంధించిన వివరాలు మెయిల్‌కు వస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Income Tax Returns: How to File, How to Get the Money We're Due?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X