ఆసీస్‌తో తొలి వన్డే- రోహిత్ శర్మ డుమ్మా: కేప్టెన్‌గా..!!
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఇవ్వాళ ఆరంభం కాబోతోంది. తొలి వన్డే ముంబైలోని వాంఖెడే స్టేడియంలో షెడ్యూల్ అయింది.
ముంబై: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోంది. టీమిండియాతో నాలుగు టెస్ట్ మ్యాచ్, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ తలపడుతోంది. నాలుగు టెస్టు మ్యాచ్ లు ముగిశాయి. 2-1 ఆధిక్యతతో దీన్ని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఇదే ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఈ మధ్యాహ్నం ఒకటిన్నరకు మొదలవుతుంది. తొలి వన్డేకు ముంబైలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తోంది.

వన్డే సమరం..
ఇక వన్డే ఇంటర్నేషనల్స్ సమరం ఆరంభం కాబోతోంది.. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఈ మధ్యాహ్నం ఒకటిన్నరకు మొదలవుతుంది. తొలి వన్డేకు ముంబైలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తోంది. 19న విశాఖపట్నంలో రెండో వన్డే, 22న చెన్నైలో మూడో వన్డే షెడ్యూల్ అయింది. ఇవన్నీ కూడా డే/నైట్ మ్యాచ్ లే. దీని తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 31వ తేదీన తొలి మ్యాచ్.

టెస్టుల తరహాలో..
టెస్ట్ సిరీస్ ను దాదాపుగా ఏకపక్షంగా మార్చేసినట్టే రోహిత్ సేన వన్డేల్లోనూ ప్రతాపం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది టీమిండియా. విజయంతో బోణీ కొట్టాలని భావిస్తోంది. దీనికోసం నెట్స్ లో కఠోరంగా శ్రమించింది. అటు ఆస్ట్రేలియా కూడా ప్రతీకారాన్ని కోరుకుంటోంది. టెస్టుల్లో ఎదురైన పరాజయ భారాన్ని వన్డేల్లో సాధించే విజయాలతో దించుకోవడానికి సమాయాత్తమౌతోంది.

రోహిత్ డుమ్మా..
తొలి వన్డేకు కేప్టెన్ రోహిత్ శర్మ డుమ్మా కొట్టాడు. ఈ మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండట్లేదు. కుటుంబ కారణాల వల్ల రోహిత్ ఆడట్లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు అతను హాజరు కావాల్సి ఉంది. రోహిత్ శర్మ స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు కేప్టెన్ గా వ్యవహరిస్తాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఆడట్లేదు. గాయం వల్ల అతను ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు.

గిల్- ఇషాన్ ఓపెనింగ్..
రోహిత్ శర్మ గైర్హాజరీ వల్ల శుభ్ మన్ గిల్ కు స్థానం దక్కింది. ఇషాన్ కిషన్ తో కలిసి అతను ఇన్నింగ్ ఆరంభించే అవకాశం ఉంది. గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో లోకల్ బాయ్ సూర్యకుమార్ యాదవ్ ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో ఇద్దరికీ మాత్రమే ప్లేయింగ్ 11లో చోటు దక్కొచ్చు.

తుదిజట్టు అంచనాలు ఇలా..
భారత తుదిజట్టులో- శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కేప్టెన్), రవీంద్రజడేజా, వాషింగ్టన్ సుందర్/శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్/యుజ్వేంద్ర చాహల్ ఆడొచ్చు. ఆసీస్ తుదిజట్టులో- డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కేప్టెన్), మార్ముస్ లాంబుషెన్, మిఛెల్ మార్ష్/మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిఛెల్ స్టార్క్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ ఆడొచ్చు.












Click it and Unblock the Notifications