వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి వరదలు: ఏటిగట్లు ఎంత వరకు సురక్షితం? వరద ముప్పును అవి తట్టుకోగలవా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్వాతంత్ర్యం అనంతరం గోదావరికి 11 సార్లు పెద్ద వరదలు వచ్చాయి

గోదావరికి చాలాకాలం తర్వాత పెద్ద వరదలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ముంపు మండలాలతో పాటుగా, దిగువనున్న కోనసీమని కలవరపెట్టాయి.

తీవ్ర అలజడి రేపినప్పటికీ క్రమంగా నదీ ప్రవాహం శాంతించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు కూడా ఉపశమనంగా భావిస్తున్నారు.

అయితే 1986, 2006 వరదల తర్వాత ఈసారి వచ్చినవే అతి పెద్ద వరదలని భావిస్తున్నప్పటికీ, గతంతో పోలిస్తే స్వల్ప నష్టంతోనే ఆంధ్రప్రదేశ్ గట్టెక్కింది. అందుకు ప్రధాన కారణం ఏటిగట్లు బలపరచడమేనని అధికారులు, స్థానికులు చెబుతున్నారు.

2008లో జరిగిన ఈ గోదావరి ఆయకట్టు ఆధునికీకరణ పనుల తోడ్పాటుతో భారీ వరదలు వచ్చినా అపారనష్టం లేకుండా గడిచిపోయిందని చెబుతున్నారు. అయితే ఇంకా అనేక చోట్ల బలహీనతలున్నట్లుగా ఈ వరదలు బయటపెట్టాయి. వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

అనేక చోట్ల ఇంకా ఏటిగట్లు బలహీనంగా కనిపిస్తున్నాయి

1986 నేర్పిన పాఠాలు

గోదావరికి గతంలో వచ్చిన వరదలతో పోలిస్తే ఈసారి వరదలకు చాలా ప్రాధాన్యత ఉంది.

స్వాతంత్ర్యం అనంతరం గోదావరికి 11 సార్లు పెద్ద వరదలు వచ్చాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 20లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని వదలాల్సిన పరిస్థితి ఆయా సందర్భాల్లో ఏర్పడింది.

1953, 1986ల్లో చాలా పెద్ద వరదలు వచ్చాయి. 1953లో 30లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 1986లో దానికి మించి చరిత్రలోనే అత్యధికంగా 35లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.

1986 ఆగస్టు 15న వచ్చిన ఈ వరదలు బీభత్సం సృష్టించాయనే చెప్పాలి. అప్పటికే ధవళేశ్వరం వద్ద బ్యారేజీ కొత్త నిర్మాణం ప్రారంభించారు. 1978లోనే ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తయ్యింది. సర్ ఆర్థర్ కాటన్ 19వ శతాబ్దంలో నిర్మించిన దానిని ఆధునీకరించి ఈ బ్యారేజ్‌ని సిద్ధం చేశారు.

ఈ బ్యారేజ్‌ని 32 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్ఛార్జ్ చేసే స్థాయికి అనుగుణంగా సిద్దం చేశారు. కొత్త బ్యారేజ్ కట్టిన ఆరేళ్లకే భారీ వరదలు వచ్చాయి. అవి కూడా అంచనాలకు మించి రావడంతో కలకలం రేగింది.

అప్పుడు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో గోదావరి పోటెత్తింది. రికార్డుల ప్రకారం గరిష్ఠ స్థాయిలో 24.55 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఒక్కసారిగా బ్యారేజ్ పరిమితిని మించిపోయేలా 35,06,388 క్యూసెక్కుల వరద జలాలు ఇన్ ఫ్లోస్ రావడంతో ఆగస్టు 16న బ్యారేజ్ సమీపంలోనే గోదావరి గట్లు తెగిపోయాయి.

సుమారు 400 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 300 మంది మరణించారు. అప్పట్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం, ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని ఆనాటి బాధితులు చెబుతూ ఉంటారు. ఆగస్టు 22 వరకూ వారం రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగింది.

‘పాతపోలవరంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎనిమిది చోట్ల ఏటి గట్ల పరిస్థితి బలహీనంగా ఉంది’

నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా వరద బాధితులను పరామర్శించారు. ఏటిగట్లు పటిష్టపరచాలని నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, చాలా కాలం వరకు అమలుకి నోచుకోలేదు. ఆ వరదలకు గోదావరి జిల్లాలు విలవిల్లాడిపోయాయి. దాంతో మరోసారి అలాంటి ఉపద్రవం తలెత్తకుండా చేసేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ముఖ్యంగా గోదావరి ఏటిగట్లు పటిష్టం చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగింది. వరుసగా ప్రభుత్వాలు మారినా, రెండు దశాబ్దాల వరకూ దానిపై దృష్టి పెట్టలేదు.

ఆ తర్వాత 1990, 1994, 2000 సంవత్సరాల్లో కూడా వరదలు వచ్చినా ప్రభుత్వాలు గోదావరి ఏటిగట్ల విషయంలో ముందడుగు వేయలేదు. చివరకు 2006 వరదల్లో మరోసారి తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యంగా అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి గన్నవరం మండలంలోని మొండెపులంక వద్ద గోదావరి గట్టు మరోసారి తెగిపోయాయి. దాంతో మరోసారి పంట, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది.

ధవళేశ్వరం వద్ద 22.8 అడుగుల నీటి మట్టం నమోదు కాగా, 28,50,664 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దాంతో దిగువన వశిష్ట, వైనతేయ, గౌతమీ పాయలు నిండుకుండలు తలపించేలా ప్రవహించడంతో ప్రమాదం జరిగింది.

''గోదావరి గట్లు పటిష్టం చేయాలనే ఎన్టీఆర్ ప్రతిపాదనలు ఆ తర్వాత అమలులోకి రాలేదు. వరుసగా పలుసార్లు వరదలు వచ్చినా నష్టం ఎక్కువగా లేకపోవడంతో నీటిపారుదల శాఖకు తగిన నిధులు కేటాయించే ప్రయత్నం జరగలేదు. ఫలితంగా 2006లో మరోసారి పెద్ద వరదలు రావడంతో గండ్లు పడ్డాయి. ఇందులో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. వరదల నిర్వహణలో జరిగిన వైఫల్యం పెద్ద నష్టానికి కారణం అయ్యింది’’ అని సీనియర్ జర్నలిస్ట్ నిమ్మకాయల శ్రీరంగనాథ్ బీబీసీతో అన్నారు.

ఏటి గట్టు

వైఎస్సార్ హయంలో మొదలైన పనులు

గోదావరి ఏటి గట్ల ఆధునికీకరణ కోసం వైఎస్సార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో పనులు ప్రారంభించారు. తొలుత రూ.400 కోట్ల అంచనాతో ప్రారంభించి రూ.540 కోట్లు వ్యయం చేసినట్టు ఇరిగేషన్ ఇంజనీర్ పి సాయిరాం తెలిపారు. మొత్తం 550 కిలోమీటర్ల మేర గోదావరి గట్ల ఆధునికీకరణ దశల వారీగా చేపట్టినట్టు వివరించారు.

''గోదావరి వరదలను అరికట్టాలంటే ఏటిగట్లు ఎత్తు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నిధులు కేటాయించడంతో పనులు జరిగాయి. అది కూడా 1986 నాటి వరదలను దృష్టిలో ఉంచుకుని ఏటిగట్లు ఎత్తు పెంచారు. ఆనాటి వరదల స్థాయికి మరో 5 అడుగుల ఎత్తులో గోదావరి గట్లు నిర్మించారు. దాంతో ఇటీవల వరుసగా 2013లోనూ, 2019లోనూ వచ్చిన వరదలను సునాయాసంగా ఎదుర్కొన్నాం. ప్రజలకు కూడా పెద్దగా అవస్థలు ఎదురుకాలేదు. ఈసారి కూడా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన వరదల నుంచి ఉపశమనం దక్కింది. కేవలం లంకలు, ఇతర కొన్ని గ్రామాల్లో మాత్రమే వరద నీరు చేరింది. మిగిలిన ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉండేందుకు ఈ పనులు తోడ్పడ్డాయి’’ అని సాయిరాం బీబీసీతో చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా నాలుగేళ్ల క్రితం కాఫర్ డ్యామ్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ కూడా నిర్మించారు. దీన్ని గోదావరి ప్రవాహానికి అతి పెద్ద అడ్డుకట్టగా చెప్పాలి. నీటి ప్రవాహం దిశ మారింది. వరద జలాలు ఎగబడే పరిస్థితి వచ్చింది.

పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలు ఇంకా ఖాళీ చేయకపోయినప్పటికీ దాదాపుగా అన్ని చోట్లకు ఈసారి వరద నీరు చేరింది. పోలవరం పూర్తయితే ఎంత మేరకు నీరు చేరుతుందో అందులో సగం వరకూ ప్రస్తుత వరద జలాలు చేరినట్టు చెబుతున్నారు. దిగువన కూడా ప్రవాహపు తీరు మారిపోయింది. ఈసారి వరదల్లో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తిగా మునిగిపోయింది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకునే సరికి ప్రవాహపు వేగంలో చాలా తీవ్రత పెరిగింది.

గతంతో పోలిస్తే గోదావరి వరద జలాల వేగం ఎక్కువగా ఉందని ఇరిగేషన్ అధికారులు కూడా చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రస్తుతం అందుకు ట్రయల్ రన్ అన్నట్టుగా తాజా వరదలు అనుభవాన్నిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఏటి గట్టు

గట్ల బలహీనతలను బయటపెట్టిన వరదలు

ఈసారి వరదల తీవ్రత తొందరగానే తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో అమాంతంగా పెరగడం, ఆ వెంటనే 24 గంటల వ్యవధిలోనే తగ్గుముఖం పట్టడంతో నష్టం లేకుండా బయటపడినట్టు కనిపిస్తోంది.

కానీ ఇంకా అనేక చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయనే విషయాన్ని ఈ సారి వరదలు బయటపెట్టాయి. పోలవరం ప్రాజెక్ట్ దిగువనే పాత పోలవరం గ్రామంలో పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగించింది. పాత పోలవరం వాసులందరినీ ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ సమస్య తలెత్తకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది.

ఇరిగేషన్ అధికారులంతా రెండు రోజుల పాటు పగలూ, రాత్రి తేడా లేకుండా అక్కడే పహారాకాస్తూ ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రి వాడుతూ నదీ ప్రవాహాన్ని నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు.

పాతపోలవరంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎనిమిది చోట్ల ఏటి గట్ల పరిస్థితి బలహీనంగా ఉందనే విషయం గుర్తించామని, వాటిని తక్షణం సరిదిద్దాలని ఫ్లడ్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న ఎన్ కృష్ణారావు బీబీసీకి తెలిపారు.

''పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరికరేవుల, కుమారదేవం ,దొంగరావిపాలెం వద్ద కూడా స్వల్పంగా సమస్యలు గుర్తించాం. వెంటనే మా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి పరిధిలోని వేమగిరి, కూళ్ల, సుందరపల్లి, బొబ్బిల్లంక వద్ద కూడా ఎటువంటి సమస్య ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. పెద్ద వరద వచ్చినా ఎదుర్కొనేందుకు అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల ఎటువంటి సమస్య రాకుండా చూడగలిగాం. ప్రస్తుతం గుర్తించిన ప్రాంతాల్లో ఏటిగట్లు పటిష్టం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి ఆయా సమస్యలను తీసుకెళ్లాం’’ అని ఆయన వివరించారు.

ఏటి గట్టు

'ఇసుక మాఫియా వల్ల సమస్యలు’

గోదావరికి ప్రస్తుతం వచ్చిన వరదల నుంచి ఉపశమనం దక్కినప్పటికీ భవిష్యత్తులో కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన రైతు ప్రతినిధి వై రాము బీబీసీతో అన్నారు.

''పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కాఫర్ డ్యామ్, స్పిల్ వే వంటి కోసం చేసిన మార్పులతో గోదావరి ప్రవాహంలో మార్పులు కనిపిస్తున్నాయి. అధికారులు వాటిని గుర్తించాలి. దానికి అనుగుణంగా ఏటిగట్లు మరింత పటిష్టం చేయాలి. కొన్నిచోట్ల ఇసుక తవ్వకందారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏటిగట్లు బలహీనపడడానికి భారీ వాహనాలు ప్రధాన కారణం. వాటిని నియంత్రించకపోతే అనూహ్యంగా వచ్చే వరదల వల్ల ఎప్పుడైనా ముప్పు పొంచి ఉంటుంది’’ అని అన్నారు.

''ఈసారి లోపాలున్నట్లు గుర్తించిన ప్రాంతాలతో పాటు ఇసుక ర్యాంపుల సమీపంలోని అన్ని గట్లు మరింత జాగ్రత్త పరచాలి. గోదావరి ప్రధాన గట్ల మీద ఆక్రమణలు కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా నిధులు కేటాయించి, వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ రెండేళ్లలో వచ్చినవాటి కన్నా మించిన వరదలు వస్తే గోదావరి వాసులు మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Floods in Godavari river flowing at high speed. Doubts arise if the bay can withstand the flow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X