కరోనా వ్యాక్సినేషన్: తన రికార్డును తానే బ్రేక్ చేసిన భారత్, ఒక్క రోజులో 1.25 కోట్లకుపైగా డోసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ పంపిణీలో భారత్ తన గత రికార్డును తిరగరాయడం గమనార్హం. ఆగస్టు 27న ఒక్కరోజే కోటి డోసులకుపైగా పంపిణీ చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం ఐదు రోజుల్లో దాన్ని బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు అంటే మంగళవారం సాయంత్రం వరకు 1.25 కోట్ల డోసులను పంపిణీ చేసింది.
ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన సిబ్బందికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. మనదేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రపంచంలోనే పెద్ధ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించిన భారత్ మరో కీలక మైలురాయిని దాటిందని కేంద్రమంత్రి తెలిపారు.

ఇప్పటి వరకు 50 కోట్ల మందికి తొలి డోసు పంపిణీ పూర్తి చేసినట్లు మాండవీయ వెల్లడించారు. ఈ మహత్తర ఘనత సాధించడంలో సహకరించిన కరోనా వారియర్లు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 65,03,29,061 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. వీరిలో 50,12,44,655 మందికి తొలి డోసు పూర్తయింది. 14,90,84,406 మందికి సెకండ్ డోసు కూడా పంపిణీ చేయడం జరిగింది.
మంగళవారం ఒక్కరోజోలోనే ఇప్పటి వరకు 1,16,75,552 మందికి టీకా వేసినట్లు కోవిడ్ పోర్టల్ వెల్లడిస్తోంది. ఇంకా మంగళవారం సాయంత్రం తర్వాత కూడా వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఆగస్టు 27న కోటి మందికిపైగా వ్యాక్సిన్ పంపిణీ చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనాపై పోరాటంలో భారత్ కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధులు అభినందించారు.
కాగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 64.36 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను కేంద్రం ఉచిత ఛానెల్, డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్‌మెంట్ కేటగిరీ ద్వారా అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఇంకా, 14,94,040 మోతాదులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీ) సరఫరా చేయబడతాయని పేర్కొంది. ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో 5,42,30,546 కోవిడ్ -19 టీకా మోతాదులు నిల్వ ఉన్నాయని, ఇంకా వాటిని ఉపయోగించలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 టీకా పంపిణీ వేగాన్ని వేగవంతం చేయడానికి, పరిధిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.
Another milestone achieved in the world's largest vaccination drive under PM @NarendraModi ji.
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 31, 2021
50 crore people received their first #COVID19 vaccine dose.
I applaud the hard work of COVID warriors & diligence of citizens in helping achieve this momentous feat 👏#50crBaahubali pic.twitter.com/5LycWu7Qst
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, ముందస్తు దృశ్యమానత ద్వారా మెరుగైన ప్రణాళికను రూపొందించడం, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడం ద్వారా టీకాలు వేయడం వేగవంతమైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఉచితంగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అందించడం ద్వారా సపోర్ట్ చేస్తోందని పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75 శాతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందిస్తున్నట్లు తెలిపింది. మనదేశంలో ప్రస్తుతం స్వదేశీ వ్యాక్సిన్లయిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ తోపాటు రష్యా ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పలు వ్యాక్సిన్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications