ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు: అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్, 3లక్షలు దాటాయి
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో దేశంలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. తొలి వేవ్ కంటే ఈ ఏడాది మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల మందికిపైగా కరోనా మహమ్మారి బారినపడి మరణించారు.
Recommended Video

భారత్‌లో కరోనా విజృంభణతో..
కరోనా మరణాల్లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. ఆ తర్వాత అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశంగా భారత్ చేరిపోయింది. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా మరణాల సంఖ్య 3 లక్షలు దాటిపోయాయి. గత కొద్ది వారాలుగా దేశంలో 4వేల మరణాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న అత్యధిక మరణాలు
కర్ణాటక, మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం కర్ణాటకలో 626 మంది మరణించారు. వారం క్రితం వరకు మహారాష్ట్రలో కూడా నిత్యం 900 మందికిపైగా మరణించారు. గత కొద్ది రోజులుగా 600లలోపు కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారంనాడు మహారాష్ట్రలో 594 కరోనా మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం.. ఆదివారం ఉదయానికి దేశ వ్యాప్తంగా 2.99 లక్షల మరణాలు నమోదయ్యాయి. తాజాగా, ఆయా రాష్ట్రాలు ప్రకటించిన రోజువారీ నివేదికలతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3 లక్షలు దాటింది.

3 లక్షలకుపైగా మరణాలతో మూడో స్థానంలో భారత్..
ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 5,89,000 కరోనా మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 4.48 లక్షల కరోనా మరణాలతో బ్రెజిల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్ 3 లక్షలకుపైగా మరణాలతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత స్థానంలో ఉన్న మెక్సికోలో 2.22లక్షల మంది మరణించారు. బ్రిటన్ దేశంలో 1.27 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34.55 లక్షల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టగా, భారత్‌లో మాత్రం కరోనా ఉధృతి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications