విపక్షాల కూటమి ఎన్డీయే కూటమిని ఓడించగలదా.. సంచలన సర్వే..!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు మరో కొన్ని నెలల సమయం ఉండటంతో సర్వేల హడావుడి ప్రారంభమైంది. ఇప్పటికే పలు సర్వేలు కేంద్రంలో తిరిగి ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేపడుతుందని చెప్పగా.. సర్వేలపై తమకు నమ్మకం లేదని విపక్షాల కూటమి పేర్కొంది. తాజాగా ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ ఇండియా టుడే-సీఓటర్ సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ పేరుతో సర్వే నిర్వహించాయి. విపక్షాల కూటమి ఇండియా ఎన్డీయే కూటమిని మట్టికరిపించలేదని సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు తెలిపారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది విపక్షాల కూటమి ఇండియా ఎన్డీయే కూటమిని మట్టికరిపించలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, 33 శాతం మంది కచ్చితంగా విపక్షాల కూటమే నెగ్గుతుందని చెప్పారు. మిగతావారు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.

విపక్షాలు కూటమిగా ఏర్పడి ఆ కూటమికి INDIA అని పేరు పెట్టడం జరిగింది. ఇది గత నెలలో బెంగళూరు వేదికగా జరిగిన సమావేశంలో నిర్ణయించడం జరిగింది. INDIA అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని అర్థం. INDIA అనే పేరుతో ఓట్లను రాబట్టగలదా అనే ప్రశ్నకు 39శాతం అనుకూలంగా సమాధానమివ్వగా 30శాతం మంది ఏకీభవించలేదు.

మరో 18 శాతం మంది కొత్త పేరు INDIA అనేది ఓట్లను పొందదని లేదా అది ఆకర్షణీయమైన పేరు కాదని చెప్పారు. మిగిలిన వారు కూటమిల పేర్ల మార్పు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి ఎవరు సరిగ్గా సరిపోతారని అడిగిన ప్రశ్నకు, 24 శాతం మంది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లను 15 శాతం మంది ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రజల అభిప్రాయం సర్వేలో మారుతూ వచ్చింది. రాహుల్ గాంధీకి అనుకూలంగా మద్దతు పెరుగుతోంది.అయితే అది ఎన్డీయేను మట్టికరిపించేంతగా కాదని తెలుస్తోంది. జనవరి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓట్లు ప్రతికూలంగా వస్తున్నాయని సర్వే వెల్లడించింది.












Click it and Unblock the Notifications