భారత్‌పై చైనా సైన్యం వీధి పోరాటాలకు దిగుతోంది..!!
న్యూఢిల్లీ: చైనా తన తెంపరి తనాన్ని ప్రదర్శించడం మానుకోవట్లేదు. భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతకు కారణమౌతోంది. ఇలాంటి ప్రయత్నాలు చేసిన ప్రతీసారీ భంగపాటుకు గురవుతున్నప్పటికీ- తన వైఖరిని మాత్రం మార్చుకోవట్లేదు. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో భారత సైన్యంపై అకారణంగా దాడికి దిగింది. ఘర్షణకు దిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా భారత సరిహద్దు భద్రత జవాన్లు గాయపడ్డారు.

రీసెర్చ్ షిప్..
ఇప్పుడు తాజాగా చైనా- మరోసారి అలాంటి తెంపరితనాన్ని ప్రదర్శించింది. భారత జలాల్లోకి దూసుకొచ్చింది. హిందూ మహాసముద్రంలో భారత జలాల్లోకి ప్రవేశించింది చైనాకు చెందిన పరిశోధక నౌక యాంగ్ వాంగ్-5. ఇప్పుడా షిప్- భారత జలాల్లో లేదని, వెనక్కి వెళ్లిపోయినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. ఈ నౌక కార్యకలాపాలను లాంగ్ రేంజ్ విజిలెన్స్ డ్రోన్లు, సముద్ర గస్తీ విమానాలు, భారత నౌకా దళ విభాగాలన్నీ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నాయి.

శ్రీలంక అండ..
కొద్ది రోజుల క్రితం హిందూ మహాసముద్ర రీజియన్‌లోకి చైనా గూఢచర్య నౌక యాంగ్ వాంగ్-5 ప్రవేశించిందని నావికాదళం పేర్కొంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహ ట్రాకింగ్ పరికరాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు చెప్పాయి. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్ట్ వద్ద ఈ నౌకను నిలపడానికి శ్రీలంక అనుమతి ఇవ్వడాన్ని భారత్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం భారత్-శ్రీలంక మధ్య దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.

ఎంఎం నరవణె కీలక వ్యాఖ్యలు..
ఈ పరిణామాలపై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ మాజీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె స్పందించారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చైనీస్ సైన్యం గూండాయిజం, వీధి పోరాటాలకు దిగిందని పేర్కొన్నారు. గతంలో గాల్వన్ లోయ, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో ఇదే జరిగిందని అన్నారు. దీన్ని ఎదుర్కొనడానికి భారత్ కూడా సదా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు రావొచ్చని చెప్పారు.

వాస్తవాధీన రేఖ వద్ద..
చాలా సంవత్సరాల నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని నరవణె స్పష్టం చేశారు. చైనా సైన్యం అనుసరిస్తోన్న వ్యూహంగా ఆయన అభివర్ణించారు. సరిహద్దుల్లో వీధి పోరాటాలకు దిగడమే చైనా దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోందని చెప్పారు. దీనిపై భారత సైన్యం గట్టిగా ప్రతిఘటించిందని, దీన్ని ఇలాగే కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి భారత్‌కు సహకరించాల్సిన బాధ్యత చైనాపై ఉందని అన్నారు.

గాల్వన్ వ్యాలీ వద్ద
గాల్వన్ వ్యాలీ, గోఘ్రా పోస్ట్ పరిధిలోకి వచ్చే పెట్రోలింగ్ పాయింట్ 15 వరకు తాము వెళ్తుంటామని, అక్కడికి వెళ్లకుండా తమను చైనా పీఎల్ఏ సైనిక బలగాలు అడ్డుకున్నాయని ఎంఎం నరవణె గుర్తుచేశారు. అది సరైన చర్య కాదంటూ చైనాను స్పష్టం చేశామని వివరించారు. పెట్రోలింగ్ పాయింట్ 15 వరకు వెళ్లకుండా చిన్న ఔట్‌పోస్ట్‌ను కూడా చైనా సైన్యం అప్పట్లో ఏర్పాటు చేసుకుందని, దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశామని నరవణె గాల్వన్ లోయ ఘర్షణ గురించి చెప్పారు.












Click it and Unblock the Notifications