రేపు INDIA కూటమి మూడో భేటీ-పగ్గాలపై క్లారిటీ-ప్రచార వ్యూహం, లోగో ఖరారు..
దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే లక్ష్యంతో విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి రేపు వరుసగా మూడో భేటీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మహారాష్ట్రలోని వాణిజ్య రాజధాని నగరం ముంబైలో ఇండియా కూటమి మూడో భేటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే పాట్నా, బెంగళూరులో రెండు సమావేశాలు నిర్వహించిన ఇండియా కూటమి పార్టీలు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు ముంబైలో మూడోసారి భేటీ అవుతున్నారు.
ముంబైలో రేపు ప్రారంభమయ్యే రెండు రోజుల భేటీలో ఇండియా కూటమి పార్టీలు.. తమ ఛైర్ పర్సన్, కన్వీనర్ పదవులకు నేతల్ని ఎన్నుకుంటారు. అలాగే సార్వత్రిక ఎన్నికల ప్రచార వ్యూహం ఖరారు చేయబోతున్నారు. దీంతో పాటు ఇండియా కూటమికి ఉమ్మడి లోగోను కూడా ఆవిష్కరించబోతున్నారు. దీంతో ముంబైలో జరిగే ఈ భేటీ కీలకంగా మారింది. ఇప్పటివరకూ జరిగిన రెండు భేటీల్ని ఈ కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న బీహార్, కర్నాటకలో నిర్వహించగా.. తొలిసారి ఈ భేటీ మాత్రం కూటమి పార్టీలు అధికారంలో లేని మహారాష్ట్రలో జరుగుతోంది.

ఇండియా కూటమిని ఎన్నికల వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపించేందుకు వీలుగా 11 పార్టీల నుంచి 11 మందితో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరెవరు ఉండాలి, ఎవరు నేతృత్వం వహించాలన్న అంశాల్ని రేపటి ముంబై భేటీలో ఖరారు చేయనున్నారు. అలాగే ఛైర్ పర్సన్, కన్వీనర్ పదవులను ఖరారు చేస్తారు. ముంబైలో జరిగే ఈ భేటీలో మరాఠా నేత శరద్ పవార్ సంగతి కూడా తేల్చేయనున్నారు. ఎన్సీపీని వీడి బీజేపీతో కలిసి డిప్యూటీ సీఎం అయిన అన్న కొడుకు అజిత్ పవార్ తో శరద్ పవార్ అంటకాగడంపై కూటమిలో పార్టీలు ఆయన్ను నిలదీసే అవకాశముంది.
ముంబైలో జరిగే ఇండియా కూటమిలో ఇప్పటివరకూ ఉన్న 26 పార్టీలతో పాటు మరికొన్ని కూటమిలో లేని పార్టీలు కూడా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కూటమి తరపున ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడం, పార్టీల కోసం కమ్యూనికేషన్ పాయింట్‌లను అభివృద్ధి చేయడంపై ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు ఇండియా కూటమి తరఫున సోషల్ మీడియా , ఇతర అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తారు. అలాగే ప్రచార కమిటీ కూడా ఉంటుంది. మరోవైపు బెంగళూరు భేటీలో కూటమికి తనను కన్వీనర్ గా ప్రకటించకపోవడంపై నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications