70 వేలకు చేరువగా కోవిడ్ యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి పెరుగుదల బాట పట్టింది. కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ 10 వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. కోవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం కూడా సూచిస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 10,112 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కు పెరిగింది. 9,833 మంది పేషెంట్ల వివిధ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 1,43,899 కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

కోవిడ్ తొలి దశ నుంచి ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,31,329గా రికార్డయింది. ప్రపంచంలోనే రెండో అత్యధిక కోవిడ్ మరణాల సంఖ్య ఇదే. కోవిడ్ మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 11,59,011 మంది అక్కడ మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, మహారాష్ట్రల వాటా అధికంగా ఉంటోంది. మరణాలు సైతం నమోదవుతోండటం ఆందోళనకరంగా మారింది.
ఢిల్లీలో 1,515 పాజిటివ్ కేసులు గత 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి. ఆరుమంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో ఈ సంఖ్య 850గా రికార్డయింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, హర్యానాల్లో కోవిడ్ కేసులు విస్తరిస్తోన్నాయి. ఈ ఎనిమిది రాష్ట్రాలను కేంద్రం ఇదివరకే అప్రమత్తం చేసింది. మరోవంక- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా 220,66,39,528 డోసుల వ్యాక్సిన్‌ను కేంద్రం పంపిణీ చేసింది.
కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోండటంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ప్రవేశపెట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్ కూడా పూర్తయ్యాయి. మాస్కులను మాత్రం ధరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తోంది. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, కనీసం ఇంకో ఏడాది పాటు ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుందని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications