కరోనా కేసులు తగ్గినా..మరణాల్లో అదే తీవ్రత: మళ్లీ 4 వేలకు: 2 కోట్లు దాటిన డిశ్చార్జీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఓ మోస్తరు తగ్గుదల కనిపించింది. రోజువారీ కేసులు కాస్త తగ్గాయి. మూడున్నర లక్షల కంటే దిగువకు నమోదయ్యాయి. బుధ, గురువారాలతో పోల్చుకుంటే తాజాగా రికార్డయిన కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తోండటం వంటి చర్యలు మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాయి. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మరణాల్లో మాత్రం అదే తీవ్రత కొనసాగుతూనే వస్తోంది. మరోసారి నాలుగు వేల మరణాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,43,144 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,000 మంది మరణించారు. 3,44,776 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోజువారీ పాజిటివ్ కేసుల కంటే.. డిశ్చార్జీలు అధికంగా నమోదవుతోంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కు చేరింది. ఇందులో 2,00,79,599 మంది కోలుకున్నారు. మరణించిన వారి సంఖ్య 2,62,317కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 37,04,893గా నమోదైంది. ఇప్పటిదాకా 17,92,98,584 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రెండు కోట్ల మార్క్‌ను అధిగమించింది. కొంతకాలంగా రోజూ మూడున్నర లక్షల మందికి పైగా కరోనా పేషెంట్లు కోలుకుంటున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. అతి తక్కువ సమయంలో దేశం.. ఈ రెండు కోట్ల ల్యాండ్ మార్క్‌ను దాటుకుంది. తాజా డిశ్చార్జీలు కూడా భారీగానే నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య కంటే అధికంగా రికార్డయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,44,776 మంది కరోనా కోరల నుంచి కోలుకున్నారు.
ఏపీ సహా అయిదు రాష్ట్రాలు అత్యధిక పాజిటివ్ కేసులను రికార్డ్ చేశాయి. మహారాష్ట్ర-42,582, కేరళ-39,955, కర్ణాటక-35,297, తమిళనాడు-30,621 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏపీలో ఈ సంఖ్య 22,399కి పరిమితమైంది. మొత్తం 3,43,144 కరోనా కేసుల్లో సగం ఈ అయిదు రాష్ట్రాలకు చెందినవే. ఆయా రాష్ట్రాల వాటా 49.79 శాతంగా నమోదైంది. ఇందులో 12.41 శాతం పాజిటివిటీ రేటు మహారాష్ట్రకు సంబంధించినది. రోజువారీ కరోనా మరణాల్లో మహారాష్ట్ర, కర్ణాటక టాప్‌లో ఉన్నాయి. మహారాష్ట్రలో 850, కర్ణాటకలో 344 మంది కరోనా కాటుకు బలి అయ్యారు.












Click it and Unblock the Notifications