భారత్‌లో పెరిగిన కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలు: ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా 4వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కొత్త కేసులు 4 లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ అంతముకుందు రోజుతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి.

దేశంలో కొత్తగా 3,62,727 కొత్త కరోనా కేసులు..
దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో(బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు) 18.64 లక్షల మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. 3,62,727 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే ఇది 15వేలు ఎక్కువే. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665కు చేరింది.

భారత్‌లో గత 24గంటల్లో 4120 మరణాలు
బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 4120 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,58,317కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. అయితే, కొత్త కేసులతోపాటు కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

పెరుగుతున్న రికవరీ.. భారత్‌కు ఇదే ఊరట
గత 24 గంటల్లో 3,52,181 మంది కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1.97 కోట్లకు చేరింది. దీంతో రికవరీ రేటు 83.26 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 37,10,525 యాక్టివ్ కేసులున్నాయి. 15.65 శాతంగా క్రియాశీల రేటు ఉంది.

ఈ రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు.. ఏపీతోపాటు..
కాగా, గత 24 గంటల్లో రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో 40వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 40వేల కంటే తక్కువగా, తమిళనాడులో 30వేల కంటే తక్కువగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో 15వేలకుపైగా, రాజస్థాన్ రాష్ట్రంలో 18వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక మొత్తంగా, 13 రాష్ట్రాల్లో 10వేల కంటే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదు రాష్ట్రాల్లో 5000-10000 మధ్య కరోనా కేసులు, మరో ఆరు రాష్ట్రాల్లో 1000-5000 మధ్య కొత్త కేసులు వెలుగుచూశాయి. 12 రాష్ట్రాల్లో వందకుపైగా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 816 మంది మృతి చెందగా, కర్ణాటకలో 517 మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications