పాకిస్తాన్‌ను బండకేసి బాదిన భారత్: ఐరాసలో అనూహ్యం
Pahalgam Terror attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

ఈ పరిణామాలు భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణానికి దారి తీసింది. రెండు దేశాలు కూడా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాయి కూడా. భారత్, పాకిస్తాన్ రెండూ తమ నౌకాదళ విన్యాసాలను నిర్వహించాయి. అరేబియా సముద్రంపై మిస్సైల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్నీ పరీక్షించుకున్నాయి.
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ వ్యవహార శైలిని భారత్ ఎండగట్టింది. ఐక్యరాజ్య సమితిలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అంశాన్ని ప్రస్తావించింది. పాకిస్తాన్.. బహిరంగంగా ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందంటూ తేల్చి చెప్పింది. ఇలాంటి వైఖరిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని విజ్ఞప్తి చేసింది.
ఐక్యరాజ్యసమితిలో విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్‌వర్క్ (VoTAN) కొత్తగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత్ సహా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ఆయా దేశాల శాశ్వత రాయబారులు, ఉప రాయబారులు దీనికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత శాశ్వత ఉప రాయబారి యోజన పటేల్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి 2008 26/11 ముంబై దాడులతో పోల్చారు. ముంబై దాడుల తరువాత ఆ స్థాయిలో అత్యధిక సంఖ్యలో సాధారణ పౌరులు ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా యోజన పటేల్ ప్రస్తావించారు. దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చుతున్నట్లు, వాటికి మద్దతు ఇస్తోన్నట్లు ఒప్పుకున్నట్టయిందని గుర్తుచేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోన్నామనే విషయాన్ని పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తోందని యోజన పటేల్ ధ్వజమెత్తారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, వాటికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని, ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం ఆలకించిందని అని యోజన పటేల్ అన్నారు.

భారత్.. దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాద బాధిత దేశమని యోజన పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు బాధితులు, వారి కుటుంబాలు, సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు స్పందించాయని, భారత్‌కు సంఘీభావాన్ని తెలిపాయని చెప్పారు.
అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదం పట్ల అనుసరిస్తోన్న జీరో టోలరెన్స్ ఇది అద్దం పడుతోందని యోజన పటేల్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిస్సందేహంగా దాన్ని ఖండించాలని తాము పునరుద్ఘాటిస్తోన్నామని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడం ఓ ముందడుగు అని పేర్కొన్నారు.
బాధితుల ఆవేదనను ఆలకించడానికి, వారికి సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇదొక నిర్మాణాత్మక ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు తమ గళాన్ని వినిపించడానికి, బాధితులకు సమష్టిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందని అన్నారు.
#IndiaAtUN
— India at UN, NY (@IndiaUNNewYork) April 28, 2025
Amb. DPR @PatelYojna delivered India’s statement at the launch of the Victims of Terrorism Association Network. (1/2) @MEAIndia @UN pic.twitter.com/1fd7arhjXy












Click it and Unblock the Notifications