కోవ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే: ప్రధాని చెప్పిన ఆ మూడు వ్యాక్సిన్లు ఇవే
లక్నో: చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది. లక్షలాదిమంది ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాని ఒక్క దేశం కూడా గ్లోబ్ మీద కనిపించదంటే.. దాని విస్తృతి, తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మహమ్మారికి మందు అంటూ ఏదీ లేకపోవడం వల్లే చెలరేగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలో కరోనా వైరస్‌ను తరిమికొట్టే వ్యాక్సిన్ తయారీలో తలమునకలు అయ్యాయి. భారత్ సహా ఎనిమిది దేశాల్లో వ్యాక్సిన్ రూపొందుతోంది.
కరోనా వైరస్‌ను మట్టుబెట్టడానికి భారత్‌లో కోవ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందీ వ్యాక్సిన్. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వందలాది మంది వలంటీర్ల సహాయంతో క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ కోవ్యాక్సిన్ విజయవంతం అవుతుందనే ఆశాభావాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. అది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే ఉత్కంఠత నెలకొంది.

ఈ పరిస్థితుల్లో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీనిపై కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరినాటికి కోవ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ దిశగా తమ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఏ తేదీన కోవ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తారనే విషయంపై హర్షవర్ధన్ క్లారిటీ ఇవ్వలేదు. టెస్టలు, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ అనే మూడింటిని ప్రాతిపదికగా తీసుకుని కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్నామని అన్నారు.
భారత్‌లో మొత్తం మూడు వాక్సిన్లు అభివృద్ధిలో ఉన్నాయనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. స్వాతంత్య్ర దినోత్సవం వేదికగా ప్రకటించారని, ఆ మూడింటినీ సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కోవ్యాక్సిన్‌తో పాటు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ మరి కొద్దిరోజుల్లో క్లినికల్ ట్రయల్స్‌కు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జైడుస్ క్యాడిలా తయారు చేస్తోన్న జైకోవి-డీ వ్యాక్సిన్‌పై ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయని, త్వరలో అవి పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.