Richest MLA: దేశంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే ఆయనే.. ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?
Richest MLA: దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్( ఏడీఆర్) ఓ నివేదికను విడుదల చేసింది. ఏడీఆర్ దేశంలోని 28 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించింది. దీని ఆధారంగా దేశంలోని అత్యంత ధనవంతులైన, అత్యంత పేద ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా నిలిచారు. ఆయన ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూ.3,400 కోట్లతో పరాగ్ షా మొదటి స్థానంలో నిలిచారు.
సంపన్న ఎమ్మెల్యే జాబితాలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నారు. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1413 కోట్లుగా ఏడీఆర్ నివేదిక పేర్కొంది. అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమబెంగాల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ. 1700 మాత్రమే కావడం విశేషం. కాగా సరైన పత్రాలు లేని కారణంగా 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించలేకపోయింది. మరో 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించే ఆస్తుల వివరాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఈ నివేదికను రూపొందించింది.

అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలలో ప్రముఖ వ్యక్తులు:
ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - రూ. 931 కోట్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి- రూ. 757 కోట్లు
కె.హెచ్. పుట్టస్వామి గౌడ, స్వతంత్ర ఎమ్మెల్యే, కర్ణాటక- రూ. 1,267 కోట్లు
ప్రియకృష్ణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక- రూ. 1,156 కోట్లు
పి. నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్- రూ. 824 కోట్లు
వి. ప్రశాంతి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్- రూ. 716 కోట్లు












Click it and Unblock the Notifications