భారత్‌కు ప్రపంచ అందాల కిరీటం- విశాఖపట్నంతో అనుబంధం..!!
వాషింగ్టన్: అందాల పోటీల్లో భారత్ మరో ఘన మైలురాయిని అందుకుంది. మిసెస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. భారత్‌కు చెందిన సర్గమ్ కౌశల్ ఈ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచారు. 21 సంవత్సరాల తరువాత మిసెస్ వరల్డ్ కిరిటీ భారత్‌కు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు మిసెస్ వరల్డ్ టైటిల్‌ను భారత్‌కే చెందిన ఆదితి గోవిత్రకర్ సొంతం చేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ కేటగిరీలో భారత్ ఈ కిరీటాన్ని సాధించింది.
అమెరికాలోని లాస్ వెగాస్‌లో మిసెస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహించారు. 63 దేశాలకు చెందిన అందగత్తెలు ఇందులో ఎంట్రీ పొందారు. వారందరినీ ఓడించిన సర్గమ్ కౌశల్- ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. సర్గమ్ కౌశల్ స్వరాష్ట్రం.. జమ్మూ కాశ్మీర్. 1990 సెప్టెంబర్ 17వ తేదీన ఆమె జమ్మూలో జన్మించారు. తండ్రి జీఎస్ కౌశల్, తల్లి రీమా ఖజూరియా.

ఇంగ్లీష్‌లో లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృతిని ఎంచుకున్నారు. బోధనపై ఆసక్తితో ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు. 2015లో ఆది కౌశల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన భారత నౌకాదళంలో అత్యున్నత క్యాడర్‌లో పని చేస్తోన్నారు. విశాఖపట్నంతో సర్గమ్ కౌశల్‌కు అవినాభావ సంబంధం ఉంది.

సర్గమ్ కౌశల్ భర్త నౌకాదళాధికారి కావడం వల్ల కొన్నాళ్ల పాటు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో పని చేశారు. ఆ సమయంలో సర్గమ్ కౌశల్ భర్తతో కలిసి విశాఖలో నివసించారు. ఆ సమయంలో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు సెలెబ్రిటీలో సర్గమ్ కౌశల్‌ను అభినందనలతో ముంచెత్తారు. అదితి గోవిత్రికర్ కూడా అభినందనలు తెలిపారు. 21 సంవత్సరాల తరువాత ఈ కిరీటం మళ్లీ స్వదేశానికి వచ్చిందని పేర్కొన్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ విరామానికి సర్గమ్ కౌశల్ తెర దించారని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications