మానవాభివృద్ధి సూచికలో భారత్ మరింత పతనం- ఒక స్ధానం దిగజారి 131వ ర్యాంకుకు
ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) కింద ప్రతీ ఏటా సభ్య దేశాల్లో అభివృద్ధి, ఇతర పరిస్ధితుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంటారు. ఇందులో భారత్ మరోసారి దిగజారింది. గతేడాది 130వ ర్యాంకులో ఉన్న భారత్ ఈ ఏడాది 131 స్ధానానికి పతనమైంది. మొత్తం 189 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 131 స్ధానంలో నిలవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఐరాస మానవాభివృద్ధి సూచిక ప్రధానంగా పలు అంశాల్లో మానవ అభివృద్ధిని సూచిస్తుంటుంది. ఇందులో జీవన ఆయుర్దాయం, విద్య, తలసరి ఆదాయం వంటి అంశాల్లో ఆయా దేశాలు ఎలా ఉన్నాయనే గణాంకాల ఆధారంగా ర్యాంకులు నిర్ణయిస్తారు. గతేడాది ఉన్న ర్యాంకు స్ధానంలో కొత్తగా ర్యాంకు నిర్ణయించేటప్పుడు ఆయా దేశాల్లో వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం తీసుకుంటున్న చర్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఐరాస మానవాభివృద్ధి సూచిక జాబితాలో తొలి మూడు స్ధానాల్లో నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. హాంకాంగ్, ఐస్‌లాండ్, జర్మనీ తర్వాతి మూడు స్దానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ పొరుగు దేశాలైన చైనా 85వ స్ధానంలోనూ, పాకిస్తాన్ 154వ ర్యాంకులోనూ నిలిచాయి. ఈ ఏడాది మానవాభివృద్ధి సూచిక విడుదల కార్యక్రమాన్ని వర్చువల్ మోడ్‌లో నిర్వహించారు. ఇందులో పలువురు ఐరాస యూఎన్‌డీపీ ప్రతినిధులతో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ నంబియార్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications