వాతావరణ శాఖ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ (IMD) ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు శుభవార్త తెలిపింది. వచ్చే 5 రోజుల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు పేర్కొంది.
అంతేగాక, లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తాజాగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, వానలు పడుతున్నా.. జూన్ నెలలో కొద్ది రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని తెలిపింది.

ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర సోమవారం మాట్లాడుతూ.. నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో 87 సెంటీమీటర్ల దీర్ఘకాలిక సగటు (LPA)లో 106 శాతం నికర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , మహారాష్ట్ర , ఒడిశా , ఛత్తీస్‌గఢ్ , ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో వర్షాధార ప్రాంతాలు, కోర్ మాన్‌సూన్ జోన్‌లలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది .
దేశంలోని మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అయితే వాయువ్యంలో సాధారణ వర్షపాతం ఉంటుంది. అయితే, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ అధికారి తెలిపారు.
కాగా, భారత వాతవరణ శాఖ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి తాకాయి.












Click it and Unblock the Notifications