India-US Trade Deal: ట్రంప్ కు భారత్ భారీ ఝలక్..! డీల్ కావాలంటే కండిషన్లు ఇవే..!
భారత్ ను దాదాపు ఏడాది కాలంగా వాణిజ్య ఒప్పందం (india-us trade deal) పేరుతో ఊరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇవాళ కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. ఈ ఒప్పందంపై ఇప్పటివరకూ అమెరికా విధించిన షరతులకు అంగీకరిస్తూ వస్తున్న కేంద్రం.. ఇవాళ తొలిసారి తమ షరతులు చెప్పింది. అంతే కాదు ఈ షరతులకు అంగీకరిస్తేనే వాణిజ్య ఒప్పందం ఖరారు చేస్తామని తేల్చిచెప్పేసింది. న్యూఢిల్లీలో జరిగిన 'లెవరేజింగ్ ఎఫ్‌టీఏస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్' జాతీయ సదస్సులో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికాతో కుదుర్చుకోబోయే ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)పై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అత్యంత వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుంది. భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా, ఇతర పోటీ దేశాల కంటే మెరుగైన ప్రాధాన్యత సుంకాలను (ప్రిఫరెన్షియల్ టారిఫ్స్) అమెరికా అంగీకరిస్తేనే ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ వ్యాపార రంగంలో ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న పోటీతో పోలిస్తే, అమెరికా భారత్‌కు తక్కువ సుంకాలను లేదా అనుకూలమైన పన్ను రేట్లను అందించిన వెంటనే ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

భారత్- అమెరికాల మధ్య మార్కెట్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం, వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ సుదీర్ఘ చర్చలు ఎగుమతి రంగంలో భారతీయ వ్యాపారులకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాకు వెళ్లే దేశీయ ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గితేనే ఇక్కడి వ్యాపారాలు పుంజుకుంటాయి. గత జూలైలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా పత్రాలు సిద్ధమయ్యాయని, కేవలం కొన్ని సాంకేతిక కారణాల వల్లే సంతకాల ప్రక్రియ ఆలస్యమవుతోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ముఖ్యంగా అమెరికా 'సెక్షన్ 301' వాణిజ్య విచారణలే ప్రస్తుత అడ్డంకిగా మారాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఎలాంటి విధానపరమైన భేదాలు లేవని, వచ్చే మూడు నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చని అమెరికా అప్పట్లో వెల్లడించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ఇతర పోటీ దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మన ఎగుమతిదారులకు స్పష్టమైన సుంకాల ప్రయోజనం దక్కాలని భారత్ పట్టుబడుతోంది.














Click it and Unblock the Notifications