భారత్-ఇరాన్ భేటీ.. అమెరికా మాస్ వార్నింగ్!!
ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షల విషయంలో అమెరికా తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. వాషింగ్టన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్‌కు ఏ దేశమైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి లేదా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా ఇరాన్ డబ్బు సంపాదించేలా ఏ దేశమైనా వ్యవస్థలను ఏర్పాటు చేస్తే.. సదరు దేశాలపై కూడా అమెరికా ఆంక్షలు విధించక తప్పదని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తరఫున ఆయన స్పష్టం చేశారు.
మోదీ-పెజెష్కియాన్ భేటీపై మార్కో రూబియో స్పందన
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా భారత ప్రధాన నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లతో సమావేశం కావడంపై మార్కో రూబియో స్పందించారు. ప్రతి దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకునే హక్కు ఉంటుందని ఆయన తెలిపారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య ఎలాంటి కొత్త వాణిజ్య ఒప్పందం జరగలేదని భావిస్తున్నట్లు చెప్తూనే.. ఇరాన్ దేశంతో ఎలాంటి ఆర్థిక, వాణిజ్య బంధాలు నెరిపినా ఆంక్షల పరిధిలోకి రావాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు.

పశ్చిమాసియా పరిణామాలు.. ప్రధాని మోదీ ఆందోళన
బిష్కేక్‌లో జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో భారత్-ఇరాన్ సంబంధాలతో పాటు పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతటి సంక్షోభమైనా చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారత ప్రాథమిక విధానమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి భంగం కలగకూడదని.. పౌరులు, నావికుల భద్రతను ప్రతి ఒక్కరూ కాపాడాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
భారత్ సాయాన్ని కోరిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం నెలకొనడానికి అమెరికా అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. తాము మొదటి నుంచీ శాంతిభద్రతలకే ప్రాధాన్యమిచ్చామని.. దౌత్య మార్గాల ద్వారానే సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపామని అన్నారు. సంక్షోభ సమయంలో భారత్ అందించిన సహకారాన్ని ప్రశంసిస్తూ.. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం భారత్ తన దౌత్య సామర్థ్యాలను, అంతర్జాతీయ ప్రభావాన్ని ఉపయోగించాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications