భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్: ఒకరు వీరమరణం- సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో కుప్వారా జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత సైన్యంపై పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక జవాన్ వీరమరణం పొందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఎదురు కాల్పులకు దిగారు జవాన్లు.
జమ్మూ కాశ్మీర్‌లో కుప్వారా జిల్లా మచ్ఛల్ సెక్టార్‌లో ఈ ఉదయం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నియంత్రణ రేఖ వద్ద గల కంకారి ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) భారత సరిహద్దు బలగాలపై ఈ కాల్పులకు పాల్పడింది. ఈ బోర్డర్ యాక్షన్ టీమ్ టీమ్‌తో పాకిస్తాన్ ఆర్మీ బలగాలు, స్పెషల్ సర్వీస్ గ్రూప్ సైనికులు కూడా ఈ కాల్పుల్లో పాలుపంచుకున్నారు.

ఈ విషయాన్ని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఒకరు వీరమరణం పొందినట్లు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు చెప్పారు. గాయపడ్డ వారిలో ఆర్మీ మేజర్ ర్యాంక్ అధికారి ఉన్నారు. గాయపడ్డ వారిని తక్షణమే కుప్వారాలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి అత్యవసరంగా అత్యాధునిక వైద్యాన్ని అందిస్తోన్నారు.
కొద్దిరోజుల కిందటే జమ్మూ కాశ్మీర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. మరో అయిదుమంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కమాండర్ స్థాయి అధికారి ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండే దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన సంభవించింది. జిల్లాలోని దేసా ఏరియాలో ఉగ్రవాదులు మకాం వేసినట్లు పక్కా సమాచారం అందడంతో సైనికులు, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో ఈ ఆపరేషన్ మొదలైంది. తెల్లవారేంత వరకూ కొనసాగింది. నాటి ఘటనలో నలుగురు సైనికులు వీరమరణం పొందారు.












Click it and Unblock the Notifications