Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాకు వ్యతిరేకంగా వద్దు: తాలిబన్లకు తేల్చి చెప్పిన భారత్, దోహాలో తొలి భేటీ, కీలక చర్చ

న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం మొదలయ్యాక భారత్ తొలిసారి దౌత్యపరమైన చర్చలకు ముందడుగు వేసింది. భారత్‌తో సత్ససంబంధాలనే కోరుకుంటున్నామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్ నేత ఖతార్‌లో భారత రాయబారి దీపక్ మిట్టల్‌తో మంగళవారం సమావేశమయ్యారు.

తాలిబన్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. తాలిబన్లతో భారత ప్రతినిధులు భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఖతార్ రాజధాని దోహాలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయం అధిపతి షేర్ మహ్మద్ అబ్బాస్ స్తానీజాయి భారత రాయబార కార్యాలయానికి వచ్చారు.

Indian Envoy Meets Taliban Leader In Doha, Raises Concerns Over Terrorism

ఈ సందర్భంగా ఆప్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించడంతోపాటు భారత్‌కు రావాలని కోరుకుంటున్న మైనార్టీల తరలింపు అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కాబూల్‌లో ఉగ్ర ఘటనలపై భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆప్ఘాన్ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా, ఉగ్రవాదానికి తావులేకుండా చూడాలని భారత రాయబారి స్పష్టం చేశారు. ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడంపై తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

కాగా, ఆప్ఘనిస్థాన్‌లో తక్షణం చేపట్టాల్సిన విషయాలపై కేంద్రం దృష్టి సారించింది. అమెరికా బలగాలు ఆప్ఘాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సభ్యులుగా ఉన్నారు. ఆప్ఘాన్ నుంచి భారతీయులు, మైనార్టీలను తీసుకొచ్చే అంశంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇప్పటికే మెజార్టీ భారతీయులను స్వదేశానికి తరలించింది. మిగిలిన కొంత మంది భారతీయులు, మైనార్టీలను తరలించేందుకు కసరత్తులు చేస్తోంది.

మరోవైపు, ఆఫ్ఘాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా స్వదేశానికి వెళ్లిపోవడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. కాబూల్ విమానాశ్రయాన్ని అమెరికా దళాలు వెళ్లిన వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టపాసులు కాలుస్తూ, తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతూ ఆనందం వ్యక్తం చేశారు తాలిబన్లు. అంతేగాక, పలు అరాచక ఘటనలకు పాల్పడుతున్నారు.

హజారా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన 14 మందిని తాలిబన్లు కాల్చి చంపారు. వారిలో 12 మంది ఆప్ఘనిస్తాన్ సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులు ఉన్నారు. తమ ఆధిపత్యాన్ని హజారా మైనారిటీ వర్గ ప్రజలు అంగీకరించకపోవడం వల్లే తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. డేకుండి ప్రావిన్స్‌లోని ఖదిర్ జిల్లాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాలిబన్ల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిందీ ఉదంతం. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సైతం ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది.

తాలిబన్లకు హజారా మైనారిటీలను బద్ధ శతృవులుగా భావిస్తుంటారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో హజారా మైనారిటీ వర్గానికి చెందిన వారిని పెద్ద ఎత్తున నియమించుకున్నారు. తాలిబన్లు ఎప్పుడు దాడులకు పాల్పడినా.. తొలుత హజారా మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో హజారా మైనారిటీలను అణచివేతకు గురైన వర్గం గుర్తిస్తారు. హజారాలు షియా మతస్తులు. అందువల్లే తాలిబన్లు వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటారని విశ్లేషకులు చెబుతుంటారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడటానికి తాలిబన్లు సహకరించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సైతం తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నింటినీ భద్రత మండలి ముందే ఊహించింది. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులకు షెల్టర్ జోన్‌గా మారకూడదని పేర్కొంది. తమ దేశ పౌరులపై గానీ.. పొరుగు దేశాలపై గానీ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేలా, టెర్రరిస్టులను ప్రేరేపించేలా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలిపింది. ఈ మేరకు భద్రత మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

ఇప్పటికీ ఆప్ఘనిస్తాన్‌లో నివసిస్తోన్న విదేశీయులు తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకునేలా తాలిబన్ల తక్షణ చర్యలను తీసుకోవాలని భద్రత మండలి సూచించింది. వారికి సేఫ్ ప్యాసేజ్ కల్పించాల్సిన బాధ్యత తాలిబన్లపైనే ఉందని తెలిపింది. దేశం విడిచి వెళ్లదలిచిన ఆప్ఘనిస్తానీయులను తాము అడ్డుకోబోమని, వారి కోసం సరిహద్దులను తెరిచి ఉంచుతామంటూ ఈ నెల 27వ తేదీన ఇచ్చిన ప్రకటనకు తాలిబన్లు కట్టుబడి ఉండాలని పేర్కొంది.

ఇది ఇలావుండగా, ఆప్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్టులో అమెరికా వదిలివెళ్లిన యూఎస్ బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ వాడేందుకు పనికిరాదని తొలుత ప్రకటించిన తాలిబన్లు... కొద్ది గంటల్లోనే దాన్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. కాందహార్ మీదుగా దాన్ని చక్కర్లు కొట్టించారు. అందులో తాలిబన్లు విహరిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ వీడియోలో కనిపించిన మరో దృశ్యం అక్కడి దారుణ పరిస్దితులకు అద్దం పట్టేలా ఉంది. తాలిబన్లు ప్రయాణిస్తున్న అమెరికన్ హ్లాక్ హాక్ హెలికాఫ్టర్ కు కింద ఓ తాడు వేలాడుతోంది. దానికి కింద ఓ శవం వేలాడుతోంది. అంటే తమకు గిట్టని వ్యక్తిని హతమార్చి ఆ హెలికాఫ్టర్ కు వేలాడదీసి మరీ తాలిబన్లు ఊరేగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా పలువురిని షాక్ కు గురి చేస్తోంది.

తాలిబన్లు తమకు పూర్తిగా పట్టున్న కాందహార్ ప్రావిన్స్ పై నుంచి ఈ హెలికాఫ్టర్ ను చక్కర్లు కొట్టించారు. ఈ ఛాపర్ కింద వేలాడుతున్న వ్యక్తి చనిపోయాడా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే వారు చంపిన వ్యక్తి శవాన్నే వారు వేలాడదీసినట్లు స్ధానికంగా వార్తలు వెలువడుతున్నాయి. దీన్ని కింద నుంచి వీడియో తీయడంతో అంత స్పష్టంగా కనిపించడం లేదు. ఈ దృశ్యాల్ని కాందహార్ ప్రావిన్స్ నుంచి చూసిన వారు భయభ్రాంతులకు గురి కాగా.. వీడియోలో చూసిన వారు కూడా షాక్ కు గురవుతున్నారు. మరికొద్ది రోజుల్లో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న తాలిబన్లు శత్రుశేషం లేకుండా చూసుకుంటున్నట్లు ఈ వీడియోను బట్టి చూస్తే అర్ధమవుతోంది.

Recommended Video

    Interview with Tdp Mahila President On Schools Re Open In Telangana | Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+