భారతీయ చమురు సంస్ధల కీలక నిర్ణయం..! ట్రంప్ సుంకాల మోత వేళ..!
భారత్ పై అమెరికా సుంకాల మోత మరింత పెరిగింది. రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ట్రంప్ సుంకాలను 50 శాతానికి పెంచేశారు. కొత్త సుంకాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు విషయంలో భారత్ ఏం చేయబోతోందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
మూడేళ్లుగా రష్యా డిస్కౌంట్ పై అందిస్తున్న చమురును కొనుగోలు చేస్తూ స్వదేశంలో ప్రజలకు ఆ ప్రయోజనం బదిలీ చేయకపోయినా విదేశాలకు సైతం దాన్ని అమ్ముకుంటున్న మన చమురు సంస్థలు ఐఓసీఎల్, బీపీ, హెచ్పీ ఇప్పుడు ట్రంప్ సుంకాల మోత తర్వాత కూడా అదే వైఖరి కొనసాగించాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపరాదని నిర్ణయించాయి.

దేశం ముందు, వాణిజ్యం తర్వాత అన్న కేంద్ర ప్రభుత్వ సందేశం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించాలని భారతీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు గత నెలతో పోలిస్తే ఈ నెలలో (అంటే సెప్టెంబర్ ఆర్డర్లు) తగ్గించినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు మాత్రం ఆపరాదని ఆయా సంస్థలు నిర్ణయించాయి. అయితే గతేడాది పోలిస్తే రష్యా చమురు డిస్కౌంట్లు కూడా తగ్గిపోయాయి. గతేడాది బ్యారెల్ ను 2.5 నుంచి 3 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఈ ఏడాది మాత్రం దాన్ని 1.5 నుంచి 1.7 డాలర్లకు పరిమితం చేస్తోంది. అయినా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

అమెరికా డిమాండ్లకు తలొగ్గడం కంటే రష్యా చమురును కొనసాగించడం ద్వారా దీర్ఘకాలంలో ఇబ్బందుల్ని అధిగమించవచ్చని కేంద్ర భావిస్తోంది. అయితే అమెరికా మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో మరింత సుంకాల మోత మోగించడంతో పాటు అదనంగా ఆంక్షలు విధించేందుకు కూడా సిద్ధమని హెచ్చరికలు పంపుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల స్థిరత్వం కోసం కేంద్రం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అమెరికాతో చర్చల్ని మాత్రం కొనసాగించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోంది.












Click it and Unblock the Notifications