యువత వారానికి 70 గంటలు పని చెయ్యాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి; నెటిజన్లు ఫైర్!!
దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వర్క్ కల్చర్ గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం చేరాలంటే భారతదేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Recommended Video

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ ప్రజలు ఎలాగైతే విరామం లేకుండా పనిచేశారో అలాగే భారతదేశ యువత కూడా పని చేయాలంటూ తాజాగా ఆయన ఒక పాడ్ క్యాస్ట్ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. అయితే చాలామంది ఐటీ ఉద్యోగులు మాత్రం 70 గంటలు పని చేయాలన్న ఆయన వాదనతో ఏకీభవించడం లేదు.

ట్విట్టర్ వేదికగా దీనిపైన జోరుగా చర్చ జరుగుతుంది. చాలామంది నారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు . 2005లో ఇన్ఫోసిస్ లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతనం ఏడాదికి 3.5 లక్షలు ఉంటే 2023 లోను అంతే ఇస్తున్నారని, 15 లక్షల ప్యాకేజీ ఇస్తే ఆయన అంచనాలకు మించిన దాని కంటే 40 గంటలు ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారని పోస్టులు పెడుతున్నారు.
జీతాలు తక్కువ ఇచ్చి ఎక్కువ పని గంటలు పని చేయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అభిప్రాయంతో తాను కూడా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. తక్కువ పనిచేసి కాలం గడపాల్సిన సమయం ఇది కాదని, ఇప్పుడు పనిలో వేగం పెంచాల్సిన, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా కొంతమంది నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించగా... చాలామంది మాత్రం ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతాలు ఇస్తారా అంటూ ప్రశ్నించడం ప్రధానంగా కనిపించింది. ఏదేమైనా ప్రస్తుతం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వర్క్ కల్చర్ పై చేసిన వ్యాఖ్యలతో నెట్టింట చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications