Cockroach Janata Party: దేశ భద్రతకు ముప్పు? రంగంలోకి ఇంటెలిజెన్స్!
భారత డిజిటల్ స్పేస్‌లో గత కొన్ని రోజులుగా ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతూ, రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ఒక వినూత్న "మీమ్ ఉద్యమం"పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇంటర్నెట్‌లో హాస్యం, వ్యంగ్యం జోడించి యువత ప్రారంభించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాను భారతదేశంలో నిలిపివేస్తూ (విత్‌హెల్డ్) కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, ఏకంగా దేశ అధికార పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల రికార్డులను సైతం బ్రేక్ చేసిన ఈ ఖాతాపై నిషేధం పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
ఈ మొత్తం రచ్చకు మూలం సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వచ్చిన ఒక వ్యాఖ్యే. మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నోటి నుంచి వచ్చిన "బొద్దింక" అనే పదం సోషల్ మీడియాలో దావానలంలా చుట్టుముట్టింది. నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని, నిరుద్యోగ యువతను కాదని న్యాయమూర్తి తర్వాత స్పష్టీకరణ ఇచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశంలో ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యువతను "బొద్దింకలు" అన్నారంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పురుడు పోసుకున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'
ఈ అసంతృప్తిని, డిజిటల్ హాస్యాన్ని ఒకే తాటిపైకి తెస్తూ బోస్టన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న 30 ఏళ్ల పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజిత్ డిప్కే మే 16న ఒక గూగుల్ ఫారాన్ని షేర్ చేశారు. "నిరుద్యోగులు, బద్ధకస్తులు, ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉంటూ ప్రొఫెషనల్‌గా విమర్శలు చేయగలవారే ఈ పార్టీకి అర్హులు" అంటూ ఆయన సరదాగా పెట్టిన పోస్ట్ ఊహించని మలుపు తిరిగింది. గంటల్లోనే 5 వేల మంది, ఆపై లక్షల మంది యువత ఇందులో సభ్యులుగా చేరారు.
చూస్తూనే ఉండగానే ఈ వ్యంగ్య ఉద్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 మిలియన్లకు పైగా (కోటి మంది) ఫాలోవర్లను దాటేసి చరిత్ర సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు ప్రశాంత్ భూషణ్ వంటి సీనియర్ అడ్వకేట్లు కూడా ఈ డిజిటల్ నిరసనకు మద్దతు తెలపడం దీని క్రేజ్‌ను మరింత పెంచింది.
జాతీయ భద్రతకు ముప్పా? రంగంలోకి ఐబీ!
అయితే, కేవలం మీమ్స్‌తో నడిచే ఈ ఖాతా హఠాత్తుగా కోట్ల మంది యువతను ఆకర్షించడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అలర్ట్ అయింది. ఈ వ్యంగ్య ఖాతా ద్వారా పోస్ట్ అవుతున్న కంటెంట్ దేశ సార్వభౌమత్వానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా మారిందని, ముఖ్యంగా దేశ యువతను తప్పుదోవ పట్టించే విద్వేషపూరిత అంశాలుగా మారే ప్రమాదం ఉందని ఐబీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఐబీ ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా.. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69 (A) కింద ఈ ఖాతాను ఇండియాలో యాక్సెస్ కాకుండా తక్షణమే బ్లాక్ చేయాలని MeitY ఆదేశాలు జారీ చేసింది.
"బొద్దింకలు చావవు".. తగ్గని డిజిటల్ స్పిరిట్!
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యాక్షన్‌పై CJP వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే ఎక్స్‌లో స్పందిస్తూ.. "మేము ఊహించినట్లే భారతదేశంలో మా అకౌంట్‌ను నిలిపివేశారు" అని పేర్కొన్నారు. అయితే ఈ నిషేధం విధించిన కొద్ది గంటల్లోనే, ఇంటర్నెట్ యువత "కాక్రోచ్ ఈజ్ బ్యాక్" (Cockroach is Back) "బొద్దింకలు ఎప్పటికీ చావవు" అనే సరికొత్త ప్రొఫైల్స్, హాష్‌ట్యాగ్‌లతో సరికొత్త ఖాతాలను తెరిచారు. గంట వ్యవధిలోనే ఈ కొత్త ఖాతాలకు కూడా వేల సంఖ్యలో ఫాలోవర్లు తరలిరావడం విశేషం.
ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మీమ్స్, హాస్యం అనేవి యువత తమ నిరుద్యోగ నిరాశను పంచుకునే వేదికలుగా ఎలా మారుతున్నాయో, అలాగే అవి ప్రభుత్వ నిఘా నీడలోకి ఎలా వెళ్తున్నాయో చెప్పడానికి ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎపిసోడ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.














Click it and Unblock the Notifications