ఆల్ టైమ్ గరిష్టానికి యమునా వరద-ఢిల్లీకి ముంపు ముప్పు-కేంద్రం జోక్యం కోరిన కేజ్రివాల్..
ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలు నాలుగో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరానికి వరద ముప్పు పెరుగుతోంది. ఉత్తరాఖండ్ తో పాటు ఎగువన ఉన్న రాష్ట్రాల నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహాలు ఢిల్లీ నగరాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి వస్తున్న యమునా నదీ ప్రవాహం ఢిల్లీని కలవరపెడుతోంది. దీంతో తాజా పరిస్ధితిపై అత్యవసర భేటీ నిర్వహించిన సీఎం అరవింద్ కేజ్రివాల్ కేంద్రం సాయం కోరారు.
ఉత్తర భారతదేశం అంతటా రుతుపవనాలతో కురుస్తున్న వర్షాలు ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీలోని యమునా నది నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. 45 ఏళ్ల క్రితం నమోదైన 207.49 స్థాయిని దాటిన యమునా నది 207.55 మీటర్ల మేర ప్రవహిస్తోంది. ఉప్పొంగిన నదీ ప్రవాహంతో ఇళ్లు, మార్కెట్‌లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదికి సమీపంలో నివసిస్తున్న చాలా మంది ఇప్పుడు తమ వస్తువులతో టెర్రస్‌పైకి ఎక్కి నీటి మట్టాన్ని నిస్సహాయంగా చూస్తున్నారు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ ద్వారా ఇకపై నీటిని విడుదల చేయకూడదని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో గత 2 రోజులుగా వర్షాలు లేవు, అయితే హత్నికుండ్ బ్యారేజీ వద్ద హర్యానా అసాధారణంగా అధిక పరిమాణంలో నీటిని విడుదల చేయడం వల్ల యమునా మట్టాలు పెరుగుతున్నాయి. కేంద్రం జోక్యం చేసుకుని యమునా మట్టం మరింత పెరగకుండా చూసుకోవాలని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా వరద పీడిత ప్రాంతాల్లో ప్రజల గుమికూడకుండా ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు.
ఢిల్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద 207.38 మీటర్ల వద్ద నది ప్రవహిస్తోంది. ఇది 2013 నాటి నీటి మట్టం 207.32 కంటే ఎక్కువగా ఉంది. గతంలో 1978లో దేశ రాజధానికి వరదలు వచ్చినప్పుడు యమునా నది 207.49 మీటర్ల మేర ప్రవహించింది. ఈ రికార్డు ఈరోజు బద్దలైంది.












Click it and Unblock the Notifications