వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్‌‌: ఈ దేశంలో అత్యున్నత అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇరాన్ నిరసనలు

ఓ టీనేజీ యువతి మొరాలిటీ పోలీస్ (నైతిక పోలీసులు) డిపార్ట్‌మెంట్‌ కస్టడీలో చనిపోవటంతో ఇరాన్‌లో నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనకారుల మీద భద్రతా బలగాలు హింసాత్మకంగా విరుచుకుపడుతున్నాయి.

మహసా అమీనీ అనే 22 ఏళ్ల మహిళను, ఆమె తన జుత్తును హిజాబ్‌తో సక్రమంగా కప్పుకోలేదనే ఆరోపణతో అరెస్ట్ చేశారు.

దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలను అణచివేయటానికి సాయుధ బలగాలు హింసను ప్రయోగిస్తుండటం వల్ల కనీసం 150 మంది జనం చనిపోయారని మానవ హక్కుల బృందాలు చెప్తున్నాయి.

నిరసనలను అణచివేయటానికి ఎప్పుడు బలప్రయోగం చేయాలనేది ఎవరు నిర్ణయిస్తారు?

అధినాయకుడి (సుప్రీం లీడర్) అధికారాలు ఏమిటి?

సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయతొల్లా అలీ ఖమేనీ. ఆయన 1989 నుంచి దేశానికి అధినాయకుడిగా కొనసాగుతున్నారు.

ఆయన రాజ్యాధినేత. సర్వసేనాని. నేషనల్ పోలీస్, మొరాలిటీ పోలీసుల మీద అధికారం ఆయనదే. మహసా అమీనీని అరెస్ట్ చేసింది ఈ మొరాలిటీ పోలీస్ అధికారులే.

ఇరాన్ అధికార వ్యవస్థ

దేశంలో అంతర్గత భద్రతను చూసుకునే ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) మీద, దాని వలంటీర్ విభాగమైన బాసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద కూడా ఖమేనీదే అధికారం.

ఇరాన్‌లో అసమ్మతిని అణచివేసే పనిని బాసిజ్ నిర్వహిస్తుంటుంది.

ఈ బలగాలన్నిటి మీదా అధికారం గల ఖమేనీకి.. నిరసనల విషయంలో ఏం చేయాలనేది నిర్ణయించటంలో ప్రధాన భూమిక ఉంటుంది.

దేశాధ్యక్షుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది?

దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

దేశంలో ఎన్నికైన అత్యున్నత నేత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. అధికారం రీత్యా సుప్రీం లీడర్ తర్వాత రెండో స్థానంలో ఉంటారు.

ప్రభుత్వ రోజువారీ నిర్వహణకు ఆయన బాధ్యుడు. అంతర్గత విధానం, విదేశీ వ్యవహారాల విషయాల్లో ఆయనకు గణనీయమైన ప్రభావం ఉంటుంది.

అయితే ఆయన అధికారాలు పరిమితమైనవి. ముఖ్యంగా భద్రతా అంశాల్లో ఆయన పాత్ర పరిమితమే.

నిరసనకారులపై హింసాత్మకంగా విరుచుకుపడుతున్న జాతీయ పోలీసు బలగాన్ని నిర్వహించేది అధ్యక్షుడి అంతర్గత మంత్రిత్వ శాఖ. అయితే ఈ బలగానికి కమాండర్‌ను నియమించేది సుప్రీం లీడర్. ఆ కమాండర్ నేరుగా సుప్రీం లీడర్‌కే జవాబుదారీ.

ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కోర్, బాసిజ్ బలగాల విషయంలోనూ ఇలాగే ఉంటుంది.

నిరసనలను బలప్రయోగంతో అణచివేయాలని సుప్రీం లీడర్ కోరకుంటే.. అధ్యక్షుడు అందుకు అంగీకరించక తప్పదు.

అధ్యక్షుడి అధికారాలకు.. కొత్త చట్టాలను చేసే పార్లమెంటు చెక్ పెట్టగలదు. అయితే.. పార్లమెంటు చేసే కొత్త చట్టాలను ఆమోదించే లేదా వీటో చేసే అధికారం గార్డియన్ కౌన్సిల్ (రక్షక మండలి)కు ఉంటుంది. ఆ మండిలో సుప్రీం లీడర్‌కు సన్నిహితులైన మిత్రులు ఉన్నారు.

నైతిక పోలీసులు ఎవరు?

వస్త్రధారణ నిబంధనలను నైతిక పోలీసులు అమలు చేస్తారు

జాతీయ పోలీసు బలగంలో నైతిక పోలీసులు భాగం. ఈ విభాగాన్ని 'గైడెన్స్ పెట్రోల్' అని పిలుస్తారు.

1979 నాటి ఇస్లామిక్ రివల్యూషన్ అనంతరం 'సరైన' వస్త్రధారణ మీద ఇస్లామిక్ నైతిక విలువలను, చట్టాలను ప్రవేశపెట్టారు. ఇవి అమలయ్యేలా చూడటానికి 2005లో ఈ నైతిక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో 7,000 మంది పురుషులు, మహిళలు అధికారులుగా ఉన్నారు. నైతిక నియమ నిబంధనల విషయంలో హెచ్చరికలు జారీ చేయటానికి, జరిమానాలు విధించటానికి, అనుమానితులను అరెస్ట్ చేయటానికి వీరికి అధికారం ఉంటుంది.

సంప్రదాయవాది అయిన దేశాధ్యక్షుడు రైసీ, హిజాబ్ నిబంధనలను అమలుచేయటానికి ఈ వేసవిలో కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు.

ముసుగులు ధరించని మహిళలను గుర్తించటానికి వీలుగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. హిజాబ్ నిబంధనలను సోషల్ మీడియాలో వ్యతిరేకించే వారికి జైలు శిక్ష తప్పనిసరి చేశారు.

రివల్యూషన్ గార్డ్స్ ఎవరు?

ఇరాన్‌లో అంతర్గత భద్రతను నిర్వహించే ప్రధాన సంస్థ ఇరాన్ రివల్యూషన్ గార్డ్ కోర్.

1979 విప్లవం అనంతరం దేశపు ఇస్లామిక్ వ్యవస్థను కాపాడటానికి దీనిని నెలకొల్పారు.

ఈ రివల్యూషన్ గార్డ్స్ ఇప్పుడు దేశంలో ప్రధాన సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తి. ఇందులో 1,50,000 మందికి పైగా సైనికులు ఉన్నారు. దీనికి తన సొంతమైన పదాతి సైన్యం, నౌకాదళం, వాయుసేన ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ఆయుధాలు ఈ సంస్థ పర్యవేక్షణలోనే ఉంటాయి.

రివల్యూషన్ గార్డ్స్‌కు ఒక విదేశీ విభాగం కూడా ఉంది. దీనిని 'కుడ్స్ ఫోర్స్' అని పిలుస్తారు. ఇది పశ్చిమాసియా అంతటా తమ మిత్రులకు రహస్యంగా డబ్బు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అందిస్తుంటుంది.

రివల్యూషన్ గార్డ్స్ నియంత్రణలో బాసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా ఉంటుంది.

బాసిజ్ ఏమిటి?

నిరసనలను అణచివేయటంలో బాసిజీలు కూడా కీలక భూమిక పోషిస్తారు

బాసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్‌ అనేది ఒక స్వచ్ఛంద పారామిలటరీ సంస్థ. అధికారికంగా 'ఆర్గనైజేషన్ ఫర్ ది మొబిలైజేషన్ ఆఫ్ ది అప్రెస్డ్' అని పిలుస్తారు. దీనిని కూడా 1979లో ఏర్పాటు చేశారు.

ఇరాన్‌లోని ప్రతి రాష్ట్రంలో, నగరంలో, దేశంలోని అధికారిక సంస్థలు చాలా వాటిల్లో ఈ సంస్థ శాఖలు ఉన్నాయి.

ఈ సంస్థలోని స్త్రీ, పురుష సభ్యులను 'బాసిజీలు' అని పిలుస్తారు. వీరు విప్లవానికి విధేయులుగా ఉంటారు. రివల్యూషన్ గార్డ్స్ ఆదేశాలకు లోబడి పనిచేస్తారు.

దాదాపు లక్ష మంది బాసిజీలు అంతర్గత భద్రత విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్తారు.

2009లో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల నాటి నుంచీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయటంలో వీరు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Iran: In whose hands is the supreme power in this country?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X