యడియూరప్ప బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్
BS Yediyurappa: అధికారాన్ని కోల్పోయిన తరువాత కర్ణాటక భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. లుకలుకలు మొదలయ్యాయి. అంతర్గత పోరు పతాక స్థాయికి చేరుకుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటీగా అవి వెలుగులోకి వస్తోన్నాయి. ఏకంగా బీజేపీకి పెద్ద దిక్కు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపైనే బాంబులు పేల్చుతున్నారు సొంత పార్టీ నేతలు.
తాజాగా- యడ్యూరప్పపై బీజేపీ శాసన సభ్యుడు బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన ఆరోపణలు కలకలం సంచలనం రేపాయి. తన కుమారుడు బీవై విజయేంద్రను పార్టీ అధ్యక్షుడిగా నియమించడానికి హైకమాండ్‌ను బ్లాక్ మెయిల్ చేశారని, తాను వేరుకుంపటి పెడతానంటూ భయపెట్టారని యత్నాల్ ఆరోపించారు.

కర్ణాట బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బీవై విజయేంద్రను పార్టీ అధిష్ఠానం ఎలా నియమించిందో ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదని చెప్పారు యత్నాల్. ఈ విషయంలో హైకమాండ్ భయాందోళనలకు గురైందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. యడ్యూరప్ప ఒత్తిళ్లకు పార్టీ నాయకత్వం తలొగ్గిందని వ్యాఖ్యానించారు.
విజయేంద్ర.. పార్టీ క్యాడర్ మొత్తాన్నీ బానిసలుగా చూస్తోన్నారని, ఆయనకు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదని ఆరోపించారు.క్రమశిక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, తామెవరం బానిసలం కాదని ఘాటుగా బదులిచ్చారు. ప్రజలకే తలొగ్గుతామని, ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు.
తన కుమారుడికి పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలను అప్పగించకపోతే- 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు తాను దూరంగా ఉంటానని, ప్రచారం చేయనని యడియూరప్ప హైకమాండ్‌ను బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి వీ సోమన్నను బలిపశువును చేశారని ధ్వజమెత్తారు
మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని ఓడించడానికి విజయేంద్ర స్వయంగా డబ్బులు పంపారని, ఆయనకు వ్యతిరేకంగా పని చేశారని యత్నాల్ విమర్శించారు. అలాంటి విజయేంద్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. తన ఓటమికి డబ్బులు పంపించినట్లు బొమ్మై సైతం స్వయంగా వెల్లడించినట్లు గుర్తు చేశారు.
బీజేపీ ఓటమి కోసం తండ్రీకొడుకులు కుట్ర పన్నారనే విషయాన్ని హైకమాండ్ ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు. శికారిపురలో విజయేంద్రపై కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందని, దీనికి కారణం డీకే శివకుమార్‌తో ఉన్న రహస్య ఒప్పందమేనని మండిపడ్డారు యత్నాల్.












Click it and Unblock the Notifications