భారత్‌కు ఎబోలా ముప్పు? కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ!
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కలవరం రేపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ సరికొత్త హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి నేరుగా వచ్చే లేదా ఆయా దేశాల మీదుగా ట్రాన్సిట్ ద్వారా ఇండియాలోకి అడుగుపెట్టే ప్రయాణీకుడికి విమానాశ్రయాలలో హెల్త్ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిఘాను మరింత కఠినతరం చేసింది. ఇప్పటివరకు దేశంలో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేసినప్పటికీ.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.
హై-రిస్క్ దేశాల జాబితా విడుదల.. విమానాశ్రయాల్లో అలర్ట్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జారీ చేసిన ఈ తాజా అడ్వైజరీ ప్రకారం.. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ముందే ఎయిర్‌పోర్ట్ హెల్త్ అథారిటీస్‌కు తమ ట్రావెల్ హిస్టరీని, ఆరోగ్య పరిస్థితిని స్వయంగా నివేదించాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నివేదికల ఆధారంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలను 'హై-రిస్క్' దేశాలుగా కేంద్రం వర్గీకరించింది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ నిబంధనలను బోర్డులపై ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు.

ప్రయాణీకులు గమనించాల్సిన ఎబోలా లక్షణాలు ఇవే!
ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించుకోవాలని, ఒకవేళ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని కేంద్రం స్పష్టం చేసింది.
*తీవ్రమైన జ్వరం
*నీరసం, విపరీతమైన అలసట
*తలనొప్పి, కండరాల నొప్పులు
*వాంతులు, విరేచనాలు
*గొంతు నొప్పి
*శరీరం నుంచి అకస్మాత్తుగా రక్తం స్రవించడం
ఎబోలా అనుమానిత లేదా ధ్రువీకరించబడిన రోగి రక్తం, శారీరక ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ప్రయాణికులు ఎటువంటి ఆలస్యం లేకుండా విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలి. ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 21 రోజులు కాబట్టి, ఇండియాలోకి అడుగుపెట్టిన 21 రోజుల లోపు ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తమ ట్రావెల్ హిస్టరీని వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్ష.. రాష్ట్రాలకు ఎస్‌ఓపీలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలాను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకే విధమైన ముందస్తు జాగ్రత్తలు అమలు చేయడానికి వీలుగా వివరణాత్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs)ని రాష్ట్రాలకు పంపారు. ఇందులో ప్రయాణికుల స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్స్, ల్యాబొరేటరీ టెస్టింగ్, అనుమానిత కేసుల క్లినికల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
ఆందోళన వద్దు.. ముందు జాగ్రత్తే ముద్దు
ఎబోలా వైరస్ ప్రస్తుతం కొన్ని ఆఫ్రికా దేశాలకే పరిమితమైనప్పటికీ.. దీని మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయంగా దేశాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత చికిత్స కోసం వెతకడం కంటే, రాకముందే సరిహద్దుల్లోనే అడ్డుకునే వ్యూహాత్మక కంటైన్మెంట్ వ్యూహాన్ని భారత్ ఎంచుకుంది. ప్రస్తుతం దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విమానాశ్రయాల్లో అప్రమత్తత కేవలం ముందస్తు నివారణ చర్యల్లో భాగం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. గ్లోబల్ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ తదనుగుణంగా అప్రమత్తత స్థాయిలను మారుస్తామని ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications