• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్ఆర్ఆర్, ఆచార్య, లవ్ స్టోరీ, F3, సర్కారు వారి పాట: కరోనా దెబ్బకు టాలీవుడ్ కోలుకోవడం కష్టమేనా?

By BBC News తెలుగు
|

కరోనా రెండో వేవ్ తెలుగు సినీ పరిశ్రమను చావుదెబ్బ తీసింది. మొదటి వేవ్ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ విలవిల్లాడింది. దాదాపు 8 నెలలపాటు కష్టాన్ని భరించి కోలుకుంటున్న సమయంలో రెండో వేవ్ మళ్లీ దెబ్బ కొట్టింది.

ఈసారి పరిశ్రమ.. వ్యాపార, ఉపాధి పరమైన నష్టాన్నే కాకుండా, ప్రాణ నష్టాన్ని కూడా చూడాల్సి వస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు చరిత్రలోనే అతి పెద్ద దెబ్బగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

టాలీవుడ్

ప్రేక్షకులు లేరు...సినిమాలు రావు

సెకండ్ వేవ్ ప్రభావం మొదట పడింది థియేటర్ల మీదే.

ప్రేక్షకులు ఏప్రిల్ రెండవ వారం నుంచి క్రమంగా తగ్గిపోయారు. దీంతో థియేటర్లు ఒత్తిడిలో పడ్డాయి.

ఇదే విషయాన్ని గమనించి సినిమాల విడుదల వాయిదా వేసుకున్నారు నిర్మాతలు.

లవ్ స్టోరీ, విరాట పర్వం, ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాల విడుదల డేట్లు వాయిదా పడ్డాయి. ఇక ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ పెట్టుకున్నవారు ఇప్పుడు సంకటంలో పడ్డారు.

సాధారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడితే, చిన్న సినిమాలకు థియేటర్లు దొరకుతాయి. కానీ ఈసారి ప్రేక్షకులు లేక థియేటర్లు మూసేస్తుండటంతో చిన్న సినిమాలు కూడా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు.

చిన్న సినిమాలతో పోలిస్తే, పెద్ద సినిమాలకే థియేటర్లు నిండుతాయి. లో బడ్జెట్ ‌సినిమాలు ఆడే థియేటర్లు చాలా సందర్భాల్లో 50శాతం కూడా నిండవు. ఈ పరిస్థితుల్లో వకీల్ సాబ్ వంటి భారీ సినిమాకు కూడా ఏప్రిల్ మూడో వారం నుంచి జనం తగ్గతూ వచ్చారు.

మొదటి వేవ్ లో సినిమా థియేటర్ల యాజమాన్యాలు బాగా నష్టపోయాయి. రెండు రాష్ట్రాల్లో పలు థియేటర్లు మూత పడ్డాయి కూడా. కానీ మొదటి వేవ్ ముగిసిన తరువాత ముఖ్యంగా డిసెంబర్ చివరి నుంచి థియేటర్లు కొంచెం కోలుకుంటున్నట్లు కనిపించాయి.

సంక్రాంతి నుంచి దాదాపు 4 నెలలుగా పరిస్థితి బాగానే ఉంది అనుకుంటున్న సమయంలోనే సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ దెబ్బ పడింది.

'' ఇప్పుడు పరిస్థితి ఎవరి చేతుల్లోనూ లేదు. రెండు మూడు వారాల నుంచి సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. సీటీమార్, విరాట పర్వం, ఆచార్య, టక్ జగదీశ్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఇష్క్, పటారుపాలెం సినిమాలదీ అదే పరిస్థితి. రిలీజ్‌లు లేకపోవడం వల్ల థియేటర్లు మూసేస్తున్నాం.

థియేటర్ల మూతకు కర్ఫ్యూ కారణం కాదు. ప్రేక్షకులు లేకపోవడమే. 80 శాతం ఫుల్ కావాల్సిన వకీల్ సాబ్ సినిమా 7వ రోజు నుంచే 40 శాతానికి పడిపోయింది'' అని సుదర్శన్ థియేటర్ల భాగస్వామి గోవింద రాజ్ అన్నారు.

టాలీవుడ్

అయితే కొన్ని సినిమా థియేటర్లు మాత్రం నడుస్తున్నాయి. వకీల్ సాబ్‌‌తో పాటూ కొన్ని డబ్బింగ్ సినిమాలూ, అలాగే శుక్ర అనే చిత్రం కూడా కొన్ని థియేటర్లలో ఉంది. తెలంగాణలో థియేటర్ల మూసివేత ఎక్కువగా ఉంది.

''కరెంటు చార్జీలు కూడా రానప్పుడు ఎందుకు నడపాలని థియేటర్ల వాళ్లు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జీవో 85 ప్రభావం కూడా పడింది. ఒక్క తూర్పుగోదావరిలోనే 40 సీ కేటగిరీ థియేటర్లు తాత్కాలికంగా మూసేశారు. 'ఏ' సెంటర్ అయినా 'సీ' సెంటర్ అయినా కరెంటు బిల్లయితే తప్పదు'' అని నిర్మాతల మండలి కోశాధికారి టి. రామసత్యనారాయణ బీబీసీతో అన్నారు.

గతంలో తెలంగాణలో సినిమా థియేటర్లకు కరెంటు బిల్లులో రాయితీ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకూ అది అమలు కాలేదు. తెలంగాణ థియేటర్ యజమాన్యాలు దీనికోసం ఎదురు చూస్తున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ధరలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో థియేటర్లను ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం ఏపీలో థియేటర్లకు 50 శాతం నిబంధనలు వర్తిస్తున్నాయి.

టాలీవుడ్

ఏ బడ్జెట్ సినిమాకు ఆ స్థాయి కష్టం...

సినిమాల షూటింగ్ ఆగిపోవడం నిర్మాతలకు డబ్బు నష్టం, పనిచేసే వారికి ఉపాధి కష్టం. వాస్తవానికి ఇప్పుడు షూటింగులు ఆపమని ప్రభుత్వం చెప్పలేదు. నిర్మాతల మండలి 50 మందితో షూటింగ్ నిర్వహించుకోవచ్చు అని చెప్పింది.

కానీ పరిస్థితి మాత్రం అందుకు అనుగుణంగా లేదు. పెద్ద సినిమాల షూటింగ్‌లు వాయిదాలు పడుతున్నాయి. చిన్న సినిమాల్లో చాలా వరకూ అదే పరిస్థితి.

ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక పాట చిత్రీకరణ మొదలు పెట్టినా, అది కూడా వాయిదా పడింది. సోనూసూద్ అనారోగ్యం ప్రభావం 'ఆచార్య' షూటింగ్ పై పడింది. 'ఎఫ్ 3' చిత్రీకరణ కూడా ఆగింది.

టాలీవుడ్

ప్రస్తుతానికి 'పుష్ప' షూటింగ్ మాత్రం కొనసాగుతోంది. 'సర్కారు వారి పాట' కూడా ఆగిపోయింది.

ఒకప్పుడు ఒక పెద్ద హీరో, తన సినిమాను ఎక్కువ కాలం తీసేవారికే ఇచ్చేవారు. అప్పట్లో రెండేళ్ల సినిమా అయినా ఒప్పుకునే ఆ నటుడు ఇప్పుడు రెండు నెలల్లో తీసేవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయనకు సన్నిహితుడైన దర్శకుడు చెప్పారు.

"అంటే ప్రొడక్షన్ కాన్సెప్టు మారింది. అండర్ ప్రొడక్షన్ సినిమాలు పెరిగాయి. ఒకప్పుడు బాలకృష్ణ ఒక్కరే ఇలా ఉండేవారు. తొందరగా సినిమా పూర్తి చేయాలి. నిర్మాతలకు నష్టం కలగకూడదు. సమయానికి రావడం, నిర్మాత ఖర్చు తగ్గించడం, ఎంతసేపైనా షూట్ చేయడం వంటి లక్షణాలుండేవి ఆయన దగ్గర.

ఇప్పుడు దాదాపు అందరిలో ఆ మోటివేషన్ వచ్చింది. అలా వేగంగా పని జరుగుతోన్న సమయంలో ఇది దెబ్బ కొట్టింది. మొదటి వేవ్ సమయంలో ప్రిపరేషన్‌కి సమయం దొరికింది. కానీ ఈసారి అలా జరగలేదు. దానికి తోడు 2020 నష్టాల భారం కూడా 2021 మీద పడ్డాయి'' అని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ అన్నారు.

''మొదటి వేవ్ నిర్మాతలకు 50 రూపాయల నష్టం చేస్తే, ఈసారి 500 నష్టం చేసింది. పెట్టుబడులు ఇరుక్కుపోయాయి'' అని అన్నారాయన.

టాలీవుడ్

''షూటింగ్ వాయిదా పడడం వల్ల అప్పులు తెచ్చిన నిర్మాతలకు వడ్డీ పెరిగిపోతోంది. చిన్నా పెద్దా అని కాదు, అన్ని సినిమాల వారికీ షూటింగ్ చేసుకోవడం కష్టంగా ఉంది'' అన్నారు రామ సత్యనారాయణ.

ప్రస్తుతం షూటింగులకు అనుమతి ఉన్నా, ఎవరూ షూట్ చేయడం లేదు. బాగా చిన్న షూటింగ్‌లు లేదా ప్యాచ్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి.

బాగా చిన్న సినిమాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పించవు. కానీ పెద్ద సినిమాల షూటింగ్ ఆగిపోతే వందల మందికి పని ఆగిపోతుంది.

''మొత్తానికి పనులు తగ్గిపోయాయి. ఎవరూ షూటింగ్ చేయడానికి ఇష్టపడడం లేదు. పెద్ద పెద్ద సినిమాలే ఆగిపోయాయి. దీంతో దినసరి కూలీల మీద ఒత్తిడి పడుతోంది. మొదటిసారి జాగ్రత్త పడే టైం కూడా లేకపోయింది. కానీ ఇప్పుడు సమయం ఉన్నా, బయటకు వచ్చే ధైర్యం ఎవరూ చేయడం లేదు. చాలా ఒత్తిడిలో ఉన్నాం'' అన్నారు నటులు కాదంబరి కిరణ్.

''ప్రస్తుతం వంద శాతం పని దొరుకుతోంది.. వంద శాతం స్టూడియోలు ఆక్యుపై అవుతున్నాయి అనుకున్న సమయంలో ఈ సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. వాస్తవానికి ఫస్ట్ వేవ్ అవగానే కనీసం డబ్బింగ్ థియేటర్, మారుమూలన ఉండేవి కూడా ఖాళీగా లేవు. అందరికీ వంద శాతం పని దొరుకుతోంది, అంతా బావుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. వంద నుంచి సున్నాకు వచ్చేసింది'' అన్నారు ప్రసన్న కుమార్.

టాలీవుడ్

ప్రాణ నష్టం

ఈసారి కరోనా సినిమా రంగంలో తీవ్రమైన ప్రాణ నష్టం కలిగిస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్, కో డైరెక్టర్లు, చిన్న నటులు, అంతగా ఫేమస్ కాని చాలా మంది టెక్నీషియన్లు, కరోనా వల్ల మృతి చెందారు. కేవలం ఉపాధి, ఆర్థికపరమైన నష్టాలే కాకుండా, ఇండస్ట్రీలో ఈసారి చాలా ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు.

''నాలుగు రోజుల క్రితం మామూలుగా ఉన్న సీఎన్ రావు, గంగయ్య వంటి వారు, ఇప్పుడు మా మధ్య లేకుండా పోయారంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఫస్ట్ వేవ్‌లో ఇంత ప్రాణ నష్టం లేదు. బాగా హై రికమండేషన్ ఉన్న వారికి కూడా బెడ్ దొరకడం కష్టంగా ఉంది'' అన్నారు ప్రసన్న కుమార్.

టాలీవుడ్

''చాలా మంది చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చనిపోతున్నారు. నిన్న పొద్దున్న నుంచి ప్రయత్నిస్తుంటే ఒకరికి బెడ్ దొరకలేదు. ఇక ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రొసెస్ చేయలేమని ఆసుపత్రులు వారు మొహం మీదే చెబుతున్నారు. అందరూ డబ్బు కట్టి ఆసుపత్రుల్లో చేరలేరు. డబ్బు, పలుకుబడి లేని వారికి నరకం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కనీసం తోటి వారు సాయం చేయడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. చాలా ఒత్తిడిలో ఉన్నాం'' అన్నారు నటులు కాదంబరి కిరణ్.

మరోవైపు సీసీసీ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలో 45 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న వారికి అపోలో ద్వారా ఉచిత వ్యాక్సీన్ అందిస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. ఆయా విభాగాల సంఘాల ద్వారా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tollywood gets a big blow from Corona
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X