
కేంద్రానికి సుప్రీం షాక్- బ్రిటీష్ కాలపు రాజద్రోహ సెక్షన్ అవసరమా ? సీజే రమణ ప్రశ్న
దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రాజద్రోహం కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీటిపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలం నాటి రాజద్రోహం సెక్షన్ కొనసాగింపు ఇంకా అవసరమా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశద్రోహం సెక్షన్ కింద విచ్చలవిడి కేసుల నమోదుపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Recommended Video
75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా అప్పట్లో బ్రిటీష్ వారు మహాత్మాగాంధీతో పాటు ఇతర స్వాతంత్ర సమరయోధుల్ని అణచివేసేందుకు వాడిన రాజద్రోహం చట్టం వాడకం అవసరమా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సీజే రమణ ప్రశ్నించారు. దేశంలో రాజద్రోహం సెక్షన్ 124ఏ దుర్వినియోగంపై ఈ సందర్భఁగా సీజే రమణ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రం లభించిన ఏడు దశబ్దాల తర్వాత కూడా ఇలాంటి చట్టం కొనసాగుతుండటం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చాలా చట్టాలను రద్దు చేస్తోందని, కానీ దీనిపై ఎందుకు దృష్టిసారించడం లేదో అర్ధం కావడం లేదన్నారు.

రాజద్రోహం చట్టం వాడకాన్ని వడ్రంగి చేతిలో చెక్కను మలిచే ఉలిగా సీజేఐ రమణ అభివర్ణించారు. వడ్రంగి తనకు కావాల్సిన ఫర్నిచర్ తయారీ కోసం అడవిలో ఓ చెట్టును నరికే బదులు మొత్తం అడవినే నాశనం చేసినట్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కేంద్రాన్ని కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ చట్టం దుర్వినియోగం విషయంలో తప్పుబట్టడం లేదని, కానీ దీన్ని అమలు చేస్తున్న అధికారుల్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు సీజే వెల్లడించారు. గతంలో సెక్షన్ 66ఏ రద్దయినా ఇంకా ఆ సెక్షన్ కింద చాలా మందిని అరెస్టు చేశారని ఆయన గుర్తు చేసారు. జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఇలాంటి చట్టాలు దుర్వినియోగమవుతున్నట్లు సీజే రమణ తెలిపారు.