కొత్త రాగం అందుకున్న మమతా బెనర్జీ!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త రాగం అందుకున్నారు. బిజెపిని గద్దె దించటం కోసం కలసి పోరాడుదాం అంటూ పిలుపునిస్తున్నారు. గతంలో తమపార్టీ ఏ కూటమిలో చేరబోదని ప్రకటన చేసిన మమతా బెనర్జీ దేశంలో తాజా పరిణామాలతో కొత్త పాట పాడుతున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని మమతా బెనర్జీ పేర్కొన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెపియేతర పార్టీలన్నీ ఐక్య పోరాటం చేయాలని మమతా బెనర్జీ పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
గతంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ప్రస్తుతం ఆమె కలిసి పోరాడుదాం రండి అంటున్నారు . త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత బెనర్జీ రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోదని, తమ పొత్తు ప్రజలతోనేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ 2024 ఎన్నికలలో కేవలం ప్రజలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళతామే తప్ప, ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయబోమని ఆమె బల్ల గుద్ది మరీ చెప్పారు.

ఇప్పుడు అందుకు భిన్నంగా బిజెపియేతర పార్టీలన్నీ ఐక్య పోరాటం చేయాలని మమతా బెనర్జీ పిలుపునిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలు దేశ ప్రజలకు, బిజెపికి మధ్య జరిగే పోరాటమని పేర్కొన్న మమతా బెనర్జీ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంతో పాటు, వివిధ పథకాలకు సంబంధించిన తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసిందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ రెండు రోజుల నిరసన దీక్షను నిన్న ప్రారంభించారు.
టిఎంసి అధ్యక్షురాలి హోదాలో తాను దీక్ష చేస్తున్నానని, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదని మమత బెనర్జీ వెల్లడించారు. ఇక నిరసన ప్రదర్శనకు అయ్యే ఖర్చును తమ పార్టీ భరిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా దీక్ష చేస్తానని తేల్చి చెప్పిన మమతా బెనర్జీ వేదికపై బీజేపీ పేరుతో అతిపెద్ద వాషింగ్ మెషిన్ ను పెట్టి, అందులో నల్లటి వస్త్రాలను వేసి తెల్లటి వస్త్రాలను బయటకు తీసి, బిజెపి పార్టీలో చేరిన అవినీతిపరులంతా సచ్చీలురుగా మారుతున్నారు అన్న అర్థం అందరికీ స్ఫురించేలా చేశారు.












Click it and Unblock the Notifications