మాయావతి రాజీనామా వెనుక ఇదీ వ్యూహం: బీఎస్పీ పునర్వైభవం కోసం..
ఇన్నాళ్లు స్తబ్దుగా సాగుతూ వస్తున్న ఆమె రాజకీయాలు మరో మలుపు తీసుకునే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి అనూహ్యంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా సాగుతూ వస్తున్న ఆమె రాజకీయాలు మరో మలుపు తీసుకునే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా బహుజనుల ప్రతినిధిగా మాయావతి రాజీనామాపై సోషల్ మీడియాలోను హర్షం వ్యక్తమవుతుండటం గమనార్హం. దళితుల సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు మంగళవారం ఆమె తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే మాయావతి అనూహ్య నిర్ణయం వెనుక.. పక్కా ప్లానింగ్ ఉందన్న వాదన వినిపిస్తోంది. త్వరలో జరగబోయే ఫూల్ పూర్ లోక్ సభ ఉపఎన్నిక ద్వారా ఆమె బరిలో దిగాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య.. ఎలాగూ ఈ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి.. త్వరలోనే ఇక్కడ బైపోల్ జరగనుంది.

కేశవప్రసాద్ మౌర్యతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఖాళీ చేసి గోరఖ్ పూర్ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక జరగనుంది. 6నెలల్లో ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే మాయావతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రత్యక్ష ఎన్నికల్లో దిగని మాయా.. ఈ దఫా అందుకు సిద్దపడి తన సత్తా ఏంటో చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

నిజానికి మాయావతి పూర్తి కాలం సీఎంగా పనిచేసిన 2007-12మధ్య కాలంలోను ఆమె ఎమ్మెల్సీగానే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత 2012లో రాజ్యసభకు వచ్చారు. ఇటీవలి యూపీ ఎన్నికలు మరోసారి బీఎస్పీకి ప్రతికూల ఫలితాలనే మిగిల్చాయి. దీంతో ఏదైనా సంచలనం నమోదం చేసి.. పార్టీని తిరిగి ఫామ్ లోకి తీసుకురావాలని మాయావతి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఇప్పుడు మాయావతి ప్రత్యక్ష ఎన్నికల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయడానికి తాను సిద్దం అని మాయావతి చెప్పడం.. అటు అఖిలేశ్ వైపు నుంచి కూడా అందుకు మద్దతు లభించడంతో.. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ల కూటమి నుంచి మాయావతి బరిలో నిలిచే అవకాశం లేకపోలేదు.
మాయావతి గనుక కూటమి తరుపున బరిలోకి దిగితే.. 2019ఎన్నికల్లోను బీజేపీయేతర శక్తులన్ని ఐక్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కేశవప్రసాద్ మౌర్య ఖాళీ చేయబోయే ఫూల్ పూర్ నియోజకవర్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ సహా అనేక మంది కీలక రనేతలు ఇక్కడి నుంచి లోక్ సభలో అడుగుపెట్టారు. ఇక్క డ విజయం సాధించడమంటే దేశవ్యాప్తంగా దానికి ప్రాధాన్యం లభిస్తుంది.
కాబట్టి బీఎస్పీ పునర్వైభవం కోసం మాయావతి ఈ దఫా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి గనుక మాయావతి ప్రయత్నాలు ఫలిస్తే.. బీఎస్పీకి మళ్లీ పునర్వైభవం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.












Click it and Unblock the Notifications