వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ మ్యుటేషన్లకు ప్లాస్మా థెరపీ ఒక కారణమా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్లాస్మా థెరపీ

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ తర్వాత ఎక్కువగా వినిపించిన మాట ప్లాస్మా థెరపీ. తమ బంధువులకు, స్నేహితులకు ప్లాస్మా కావాలంటూ చాలామంది సోషల్ మీడియాలో రిక్వెస్టులు కూడా పెట్టారు.

అయితే ఈ చికిత్సా విధానం సరైంది కాదని అభిప్రాయపడుతున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కోవిడ్ -19 చికిత్స మార్గదర్శకాల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది.

ప్లాస్మా థెరపీ వల్ల వైరస్ బాధితులు పెద్దగా ప్రయోజనం పొందడం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, మంగళవారం నాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అందుకు భిన్నమైన ప్రకటన చేసింది.

ఒక డాక్టర్‌ ప్లాస్మా థెరపీని ఉపయోగించాలంటే బాధితుడి అనుమతితో చేయవచ్చని ఐఎంఏ ఫైనాన్షియల్ సెక్రటరీ ప్రకటించారు.

ఈ రెండు ప్రకటనలతో ఒక చికిత్సా విధానంపై మెడికల్ అసోసియేషన్‌, వైద్యపరిశోధనా మండలి మధ్య భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తమయ్యాయన్న సందేహం ఏర్పడింది.

ప్లాస్మా థెరపీ గురించి ఐఎంఏ ఏం చెప్పింది?

ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ఐఎంఏ జాతీయ కార్యదర్శి జయలాల్‌తో బీబీసీ మాట్లాడింది. '' ఒక సంవత్సరంపాటు ఈ చికిత్స అందిస్తూ, దానివల్ల ప్రయోజనం ఉందని ఏ వైద్యుడైనా భావిస్తే దానిని కొనసాగించ వచ్చు.'' అన్నారు జయలాల్.

ప్లాస్మా థెరపీతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పలేమని, అయితే ఆ చికిత్స చేసే ముందు బాధితుల నుంచి రాత పూర్వక అంగీకారాన్ని తీసుకోవాలని జయలాల్ స్పష్టం చేశారు.

కోవిడ్ మార్గదర్శకాల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆయన అన్నారు.

వాస్తవానికి ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే చికిత్స అందించాలని ఏ వైద్యుడికి, వైద్య సిబ్బందికి చట్టపరమైన నిబంధనలు ఏమీ లేవు. కానీ, దేశంలోని వైద్య సిబ్బంది మాత్రం ఆ ప్రొటోకాల్ ప్రకారమే చికిత్స అందించాల్సి ఉంది.

ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదని క్లినికల్ ట్రయల్స్‌లో పదే పదే తేలినా, దాని ప్రభావం చాలా కొద్దిగా మాత్రమే ఉంటుందని తెలిసినా, డాక్టర్లు ఎందుకు ఈ థెరపీ గురించి ఆలోచిస్తున్నారు?

''ఐవర్‌మెక్టిన్, క్లోరోక్విన్ , విటమిన్ సి లాంటి చాలా మందులు కోవిడ్ బాధితులకు చికిత్సలో సంపూర్ణంగా ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇవి కనీసం 50% ప్రభావం చూపుతున్నాయని కూడా చెప్పలేం. కానీ, గ్రామీణ ప్రాంతాలలో చికిత్సకు ఐవర్‌మెక్టిన్ కొంత వరకు ఉపయోగపడిన సందర్భాలు ఉన్నాయి'' అని జయలాల్ అన్నారు.

చికిత్స ప్రయోజనంపై విస్తృతమైన, బలమైన ఆధారాలు లేకపోవడం వల్లే ఐసీఎంఆర్ కోవిడ్ మార్గదర్శకాల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించిందని జయలాల్ అన్నారు.

ప్లాస్మా థెరపీ

ప్లాస్మా చికిత్స అంటే ఏంటి?

రక్తంలోని ద్రవ రూప భాగమే ప్లాస్మా. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. ఇందులో యాంటీబాడీలు ఉంటాయి. ఇవి వైరస్ మీద పోరాడతాయి.

వ్యాధి నుంచి బైటపడిన వ్యక్తి నుంచి తీసిన ప్లాస్మాను వైరస్ బాధితుడి రక్తంలోకి ఎక్కిస్తారు. కరోనా మొదటి వేవ్‌లో కూడా ఈ విధానాన్ని ఉపయోగించారు.

ప్లాస్మా దానం చేసే నాటికి 28 రోజుల ముందు వరకు దాతలలో కోవిడ్ లక్షణాలు ఉండకూడదు.

ప్లాస్మా థెరపీ

ఈ చికిత్సపై వివాదం ఎందుకు?

కోవిడ్‌ సోకిన రోగులపై ప్లాస్మా చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి ఐసీఎంఆర్ గత సంవత్సరం ఒక అధ్యయనం చేసింది. దీనినే ప్లాసిడ్ (PLACID)ట్రయల్ అంటారు.

కరోనా ప్రభావం తీవ్రం కాకుండా, బాధితుల మరణాలను నివారించడంలో ప్లాస్మా థెరపీ ప్రభావవంతంగా ఉందని 2020 సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో మెడికల్ కౌన్సిల్ వెల్లడిచింది. 2020 ఏప్రిల్ 22 నుండి జూలై 14 వరకు 464 మందిపై ప్లాస్మా థెరపీ ప్రభావాన్ని పరిశీలించినట్లు వెల్లడించింది.

అయితే, కోవిడ్ చికిత్స మార్గదర్శకాల నుంచి ప్లాస్మా థెరపీని తొలగించే ఆలోచనలో ఉన్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బలరాం భార్గవ తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదని ప్రముఖ మెడికల్ జర్నల్ 'లాన్సెట్’ మే 14న విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. కరోనా తీవ్రతను తగ్గించడంలో దాని ప్రభావం ఏ మాత్రం లేదని వెల్లడించింది.

ప్లాస్మా థెరపీ

నిపుణులు ఎందుకు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు?

దేశవ్యాప్తంగా వైద్యులు కోవిడ్ చికిత్సలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించాలని చెబుతున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్లాస్మా థెరపీని ఉపయోగించడంలో పెద్ద నష్టం లేదని అంటోంది. అయితే, బాధితులు కోరితేనే ఈ చికిత్స చేయాలని స్పష్టం చేస్తోంది.

ప్లాస్మా థెరపీ వినియోగంపై ఏర్పడ్డ గందరగోళంపై సర్ గంగారామ్ ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ వైస్‌ ఛైర్మన్ అతుల్ కక్కర్‌తో బీబీసీ మాట్లాడింది.

''మేం కూడా ఈ చికిత్సను వాడాము. ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకంగా ప్రభావం ఉంది. దీనిలో ఒక్కోసారి వ్యక్తి రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు శరీరంలోని వైరస్‌లు చురుకుగా మారి హాని కలిగించే అవకాశం ఉంది'' అని ఆయన అన్నారు.

ఒక వ్యక్తి శరీరంలోకి యాంటీ బాడీలను ప్రవేశ పెట్టినప్పుడు, వైరస్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. యాంటీబాడీల ప్రభావాన్ని తగ్గించడానికి అది మ్యుటేషన్ చెందే అవకాశం కూడా ఉందని ఐసీఎంఆర్ చెప్పినట్లు డాక్టర్ అతుల్ కక్కర్ తెలిపారు.

వైరస్‌ మ్యుటేషన్లకు ప్లాస్మా థెరపీ కూడా ఒక కారణమని ఇంగ్లాండ్‌లో జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది.

ప్రభావం నిరూపణ కాని ప్లాస్మాథెరపీ లాంటి చికిత్సలను వాడటం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు.

అందుకే ప్లాస్మా థెరపీని ఐసీఎంఆర్ కోవిడ్ మార్గదర్శకాల నుంచి తొలగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is plasma therapy also a factor in coronavirus mutations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X