యూపి విభజనకి బిజెపి పక్కాప్లాన్, మాయకు కౌంటర్?
లక్నో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించి... యూపిఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ విభజనకు సహకరించిన భారతీయ జనతా పార్టీ కన్ను ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ పైన పడింది. యూపిని మూడు రాష్ట్రాలుగా చేయాలని బిజెపి పావులు కదుపుతోంది. యూపిలో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూపిని విభజించి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బిజెపి ప్రణాళికలు తయారు చేసుకుంది.
అధికార సమాజ్ వాది పార్టీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాగా.. మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ రాష్ట్రాన్ని నాలుగుగా విభజించాలని చెబుతోంది. బిజెపి మాత్రం మాయా ప్రతిపాదనకు భిన్నమైన ఫార్ములాతో సిద్ధమైందట. ఉత్తర ప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం.

యూపిలో 80 లోకసభ స్థానాలు ఉన్నాయి. యూపిలో ఎంత ఎక్కువ లోకసభ స్థానాలు గెలుచుకుంటే ఢిల్లీ పీఠానికి అంత దగ్గర అని అన్ని పార్టీలు భావిస్తాయి. ఈ కారణంగానే బిజెపి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో యూపి పైన ప్రత్యేక దృష్టి సారించింది. 80 స్థానాలలో 73 స్థానాలు గెలుచుకుంది.
ఎస్పీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో నేరాలు.. ముఖ్యంగా అత్యాచార సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన పైన బిజెపి చర్చకు తెర తీస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో అఖిలేష్ ప్రభుత్వం విఫలమైందని దాడికి దిగిన బిజెపి.. మరోవైపు విభజన వల్ల రాష్ట్రానికి ఏవిధంగా మేలు జరుగుతుందన్న దాని పైన అంతర్గతంగా వాదనలు సిద్ధం చేసుకుందట.
విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న యూపు విభజనకు వీలుగా అడుగులు వేస్తూ ఉండాలని బిజెపి యూపి వ్యవహారాల పర్యవేక్షకుడు అమిత్ షా... ఆ పార్టీ మంత్రులు కొందరికి చెప్పారట. 2017 యూపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అమిత్ షా.. విభజనకు వ్యూహం రూపొందిస్తున్నారని అంటున్నారు. 2017 వరకు మోడీ హవా ఉండకపోవచ్చునని.. ఈ నేపథ్యంలో ఎస్పీ, బిఎస్పీలను చిత్తు చేయాలంటే ఇతర వ్యూహాలు రచించాలని బిజెపి నేతలు భావిస్తున్నారట.
2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయావతి ప్రభుత్వం యూపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ప్రతిపాదించారు. మధ్య యూపి (అవధ్), తూర్పు యూపి (పూర్వాంచల్), దక్షిణ యూపి (బుందేల్ ఖండ్), పశ్చిమ యూపి (హరిత ప్రదేశ్). ఇందులో హరిత ప్రదేశ్ ప్రతిపాదన పట్ల బిజెపికి అభ్యంతరాలు ఉన్నాయి. హరిత ప్రదేశ్, అవధ్‌లను కలిపి ఉంచాలనేది అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలు అమిత్ షా ఫార్ములాను సమర్థిస్తున్నారట.
ఈ వ్యూహంతో ముందుకు వెళ్తే 2017 ఎన్నికల్లో బిజెపికి బాగా లబ్ధి ఉంటుందని భావిస్తున్నారట. అయితే ఈ వ్యూహాన్ని మోడీ ప్రభుత్వం అంచలంచెలుగా చేయనుందట. తొలుత బుందేల్ ఖండ్‌కు, పూర్వాంచల్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి, పరిమిత స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి చర్యలతో పని ప్రారంభించనుందట. బిజెపికి లోకసభలో మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో లేదు. ఈ కారణంగా ఇతర పార్టీల మద్దతుకు ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications