వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో నిరుద్యోగ సంక్షోభం పైకి కనిపిస్తున్న దాని కన్నా తీవ్రంగా ఉందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిరుద్యోగం

న్యాయవిద్యలో డిగ్రీ సంపాదించిన ఒక వ్యక్తి, గతవారం డ్రైవర్ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 15 తక్కువ నైపుణ్యం కలిగిన ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరైన పదివేలకు పైగా నిరుద్యోగుల్లో జితేంద్ర మౌర్య కూడా ఒకరు.

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు, ఎంబీఏ చదివారు. కొందరు మౌర్య తరహాలో జడ్జి ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా, వారి స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు.

''పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక్కోసారి పుస్తకాలు కొనుక్కోడానికి కూడా డబ్బు ఉండదు. అందుకే ఈ పని కోసం ఇక్కడికి వచ్చాను'' అని మౌర్య ఒక వార్తా సంస్థకు చెప్పారు.

భారతదేశం ఎదుర్కొంటోన్న తీవ్రమైన ఉద్యోగాల సంక్షోభం ఎలా ఉందో మౌర్య దుస్థితి చూస్తే అర్థమవుతుంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఇప్పటికీ ఇది దీర్ఘకాలిక మందగమనంలో ఉంది. పెంట్ అప్ డిమాండ్‌తో పాటు పెరిగిన ప్రభుత్వం వ్యయం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది.

కానీ ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతున్నాయి.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో దాదాపు 8 శాతానికి పెరిగింది. 2020లో, 2021లో చాలావరకు ఇది 7 శాతం కంటే ఎక్కువగా ఉంది.

''తాజా నిరుద్యోగిత రేటు, భారతదేశంలో కనీసం గత మూడు దశాబ్ధాలుగా నమోదైన దానికంటే చాలా ఎక్కువ. 1991నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇలా లేదు'' అని వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు అన్నారు.

2020లో చాలా దేశాల్లో నిరుద్యోగం పెరిగింది. కానీ భారత్‌లో ఇది మరింత ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ (5.3 %), మెక్సికో (4.7 %), వియత్నాం (2.3 %) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్‌లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉంది.

అంతేకాకుండా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా కాలంలో ఖర్చును తగ్గించుకోవడానికి, ఉద్యోగులను తొలగించే పద్ధతిని కంపెనీలు అవలంభించడం ఇందుకు ఒక కారణమని సీఎంఐఈ పేర్కొంది. 2020 లాక్‌డౌన్ కాలంలో, 15 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వర్కర్లే దీనివల్ల ఎక్కువగా నష్టపోయారని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తెలిసింది.

''అంతా గందరగోళంగా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు ఉద్యోగాలు చేస్తోన్న వారిలో సగం మంది ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు మేం కనుగొన్నాం'' అని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఎకనమిస్ట్ అమిత్ బసోల్ చెప్పారు.

జాబ్స్ ఫెయిర్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి క్యూలో నిల్చొన్న భారతీయ యువకుడు

ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోవడానికి, కరోనా కొంతవరకు మాత్రమే కారణమని ఆర్థికవేత్తలు అంటున్నారు.

''వర్కర్లు, చిన్నతరహా వ్యాపారుల శ్రేయస్సు కోసం పాలసీలను రూపొందించడంలో తక్కువ శ్రద్ధ చూపించారనే వాస్తవానికి భారత్‌లోని పరిస్థితులు అద్దం పడుతున్నాయి. 2020 లాక్‌డౌన్ కాలంలో దీన్నిమనం చూశాం'' అని ప్రొఫెసర్ బసు అన్నారు.

భారత్‌లో పేరుకుపోయిన నిరుద్యోగం స్థితిగతులను తాజా గణాంకాలు, లెక్కలు పూర్తిగా వివరించలేవు.

పనిచేసే వయస్సుకి వచ్చిన జనాభా పరంగా చూస్తే వీరిలో ఇప్పుడు పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయింది. శ్రామిక శక్తిలో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న మహిళల నిష్పత్తి... ప్రపంచంలో మన దగ్గరే అత్యల్పంగా ఉంది.

భారత్‌లో నిరుద్యోగాన్ని తరచి చూస్తే, విద్యావంతులైన యువకులు 'ఫార్మల్ ఎకానమీ'లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌లోని 'ఇన్‌ఫార్మల్ ఎకానమీ', 90 శాతం శ్రామిక శక్తిని కలిగి ఉండటంతో పాటు ఆర్థికాభివృద్ధిలో సగభాగం తన సహకారాన్ని అందిస్తోంది.

''నిరుద్యోగం అనేది విద్యావంతులు, డబ్బున్నవారు మాత్రమే భరించగలిగే విలాసవంతమైన వస్తువు. పేదవారు, నైపుణ్యం లేని లేదా తక్కువ నైపుణ్యాలున్న వ్యక్తులు దీన్ని భరించలేరు'' అని కార్మిక ఆర్థికవేత్త రాధిక కపూర్ అన్నారు.

ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులే ఎక్కువగా నిరుద్యోగంలో చిక్కుకుపోతున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు తక్కువ స్థాయి, హోదా ఉన్న ఉద్యోగాలను చేసేందుకు ఇష్టపడరు. మరోవైపు ఎక్కువగా చదువుకోలేని పేదవారు మాత్రం చేతికొచ్చిన పనిని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.

కాబట్టి, నిరుద్యోగ సంఖ్య ప్రకారం ఎకానమీలో కార్మికుల సరఫరా గురించి పూర్తిగా చెప్పలేం.

భారతదేశంలోని శ్రామిక శక్తిలో మూడొంతుల మంది స్వయం ఉపాధి పొందుతున్నవారే. వీరికి రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్, హెల్త్ కేర్, మెటర్నిటీ బెనిఫిట్స్ వంటి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు.

అనధికార ఉద్యోగాలు

శ్రామిక శక్తిలో కేవలం 2 శాతం మంది మాత్రమే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు, మూడు కంటే ఎక్కువ సంవత్సరాల పాటు రాతపూర్వక ఒప్పందాలు వంటి సోషల్ సెక్యూరిటీతో కూడిన ఫార్మల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. మరో 9 శాతం మంది, కనీసం ఒక సామాజిక భద్రత ప్రయోజనాన్ని కలిగి ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు.

''భారత్‌లోని శ్రామిక శక్తిలో ఎక్కువ మంది దుర్బలంగా ఉన్నారు. వారి ఉనికి సందిగ్ధావస్థలో ఉంది'' అని డాక్టర్ కపూర్ అన్నారు.

సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. ఉద్యోగాలు చేస్తున్నవారిలో, నెలకు జీతంగా రూ. 9,750 కన్నా తక్కువ పొందుతున్నవారు 45 శాతంగా ఉన్నారని సర్వేలు సూచిస్తున్నాయి. రోజుకు కనీస వేతనం రూ. 375 ఉండాలని 2019లో ప్రతిపాదించారు. కానీ ఇది తర్వాత అమలు కాలేదు. ఈ ప్రతిపాదిత వేతనం కంటే కూడా తక్కువ జీతాన్ని ఉద్యోగులు పొందుతున్నారు.

ప్రాథమికంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం తర్వాత సేవల రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారడం... దేశంలో స్థానిక నిరుద్యోగం పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. భారతదేశ పరిమాణంలో ఉన్న మరే ఇతర దేశంలోనూ ఆర్థికాభివృద్ధి సేవల రంగం ద్వారా జరగడం లేదు.

అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు మాత్రమే చేయగలిగే సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్ వంటి సేవల రంగం ద్వారా భారతదేశం ఆర్థికాభివృద్ధిని సాధిస్తోంది. పెద్దగా నైపుణ్యాలు లేని వారికి ఉద్యోగాలనిచ్చే తయారీ సంస్థలు లేదా ఫ్యాక్టరీ జాబ్స్ మన దగ్గర చాలా తక్కువగానే ఉన్నాయి.

భారతదేశంలో నిరుద్యోగం ఆందోళనకరంగా ఉంది. దేశం ఆర్థికాభివృద్ధిలో పుంజుకుంటున్నప్పటికీ, దిగువ విభాగం ఇతర చాలా దేశాల కంటే అధ్వాన్నంగా ఉందని ప్రొఫెసర్ బసు చెప్పారు.

ప్రభుత్వం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ఉపాధిని కల్పించాలని, వర్కర్లకు మద్దతుగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

వివక్ష, విద్వేష రాజకీయాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆర్థికాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి.

పుష్కలంగా ఉద్యోగాలను వస్తాయని వాగ్ధానం చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ, కీలక పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు 'మేకిన్ ఇండియా' ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కానీ వీటిలో ఇప్పటివరకు ఏదీ కూడా తయారీ, ఉద్యోగాల బూమ్‌కు దారి తీయలేదు. డిమాండ్ తగ్గడమే ఈ పరిస్థితికి కారణం.

దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం కుటుంబాలకు నగదు బదిలీ, ఉపాధి హామీ పథకం వంటి వాటిని అమలు చేయాలని డాక్టర్ బసోల్ వంటి చాలామంది నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో, కార్మికులందరికీ కనీస వేతనం, సామాజిక భద్రత అమలయ్యేలా చూడాలని అంటున్నారు.

''అప్పటివరకు ఉద్యోగాల్లో మనకు ఎలాంటి అర్థవంతమైన సంస్కరణలు రావు'' అని డాక్టర్ కపూర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is the unemployment crisis in India worse than it looks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X