lok sabha elections 2019 by poll by election congress bharatiya janata party bjp haryana లోకసభ ఎన్నికలు 2019 ఉప ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ హర్యానా mood of the nation opinion poll
జింద్‌లో ఉప ఎన్నిక, చతుర్ముఖమే: బీజేపీ-కాంగ్రెస్, మరో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ
చండీగఢ్: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రతి అసెంబ్లీ లేదా ప్రతి ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. చిన్న ఎన్నిక జరిగినా దానిని ఓ విధంగా సెమీ ఫైనల్‌గానే భావిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రతి ఎన్నికకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా, హర్యానాలోని జింద్ నియోజకవర్గంలో సోమవారం ఉప ఎన్నికలు జరిగాయి.
బరిలో బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, జన్నయక్ జనతా పార్టీ (జేజేపీ)లు బరిలో ఉన్నాయి. హర్యానాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అయితే, ఐఎన్ఎల్డీ (ఇండియన్ నేషనల్ లోక్ దళ్) పార్టీ ఎమ్మెల్యే హరి చంద్ మిధ్రా ఇటీవల కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

జింద్ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొని ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ, సిట్టింగ్ స్థానమైన ఐఎన్ఎల్డీ, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా ఏర్పడిన జేజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. లోకసభ ఎన్నికకు ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నికను స్థానికంగా సెమీ ఫైనల్‌గా చెబుతున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు జనవరి 31వ తేదీన రానున్నాయి. అన్ని పార్టీలు దాదాపు బలంగానే ఉన్నాయి. ఎవరు గెలుస్తారనే విషయంపై ఎవరూ సరైన అంచనాకు రాలేకపోతున్నారు.
జింద్ నియోజకవర్గంలో 1.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జాట్ల ఓట్లు ఎక్కువ. 45వేలకు పైగా వారి ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత బ్రాహ్మణులు, ట్రేడర్ కమ్యూనిటీ, పంజాబీల ఓట్లు పదివేల నుంచి పదిహేను వేల మధ్యన ఉన్నాయి. ఎస్టీ, ఎస్సీల ఓట్లు ఎక్కువే. 1972 నుంచి ఇక్కడ జాట్ యేతర అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందుతుండటం గమనార్హం. అయితే ఈసారి బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలు జాట్ అభ్యర్థిని బరిలో దింపాయి. ఇక్కడి నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కొడుకును బరిలోకి దింపింది.