భారత్ సరిహద్దుల్లో చైనా బరితెగింపు: శౌర్య కమెండోలను దించిన కేంద్రం
భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు తలెత్తుతూనే వస్తోన్నాయి. అవి పూర్తిగా సమసిపోలేదని, సరిహద్దు ప్రాంతాల్లో రెండు దేశాల జవాన్ల మధ్య తరచూ ఘర్షణపూరక వాతావరణం నెలకొంటోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరుదేశాల సైనికుల మధ్య తరచూ తోపులాటలు చోటుచేసుకుంటోన్నాయి. లఢక్ మొదలుకుని అరుణాచల్ వరకూ చాలాచోట్ల ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఈ వివరాలను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ శతృజీత్ కపూర్ స్వయంగా వెల్లడించారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం చైనా సరిహద్దుల వద్ద ఐటీబీపీ బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ దేశ రక్షణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తోన్నాయని అన్నారు. ఢిల్లీలో ఐటీబీపీ హిమ్వీర్ సమ్మాన్ పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. సరిహద్దుల వద్ద తాజా పరిస్థితుల గురించి వెల్లడించారు.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఇటీవల చోటు చేసుకున్న తోపులాటల్లో ఐటీబీపీకి చెందిన ప్రత్యేక శౌర్య కమాండోలు అత్యంత సమర్థవంతంగా వ్యవహరించినట్లు శతృజీత్ కపూర్ చెప్పారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో చొరబాట్లను తిప్పికొట్టడానికి, అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో సమర్థవంతంగా పహారా కాయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన శౌర్య కమాండోల పూర్తిస్థాయి బెటాలియన్ను త్వరలోనే రంగంలోకి దించనున్నట్లు ఆయన వెల్లడించారు.
భారత్, చైనా మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంట భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి తక్షణ చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనడానికి శౌర్య పేరుతో ఈ నూతన ప్రత్యేక కమాండో విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని శతృజీత్ కపూర్ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఈ శౌర్య కమాండోలు ఇప్పటికే తమ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించారని స్పష్టం చేశారు.
చైనాను ఎదుర్కొనడానికి సాంప్రదాయ యుద్ధ పద్ధతులు మాత్రమే సరిపోవని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే సరిహద్దు రక్షణ బాధ్యతలు చూసే ప్రతీ బెటాలియన్లో ఈ శౌర్య కమాండోల విభాగాన్ని ప్రత్యేకంగా మోహరించనున్నట్లు వివరించారు. వీటికి అనుగుణంగా సరిహద్దు బెటాలియన్లన్నింటిలో డ్రోన్ ప్లాటూన్లను అందుబాటులోకి తెస్తోన్నామని,రూ.400 కోట్ల నిధుల్లో దాదాపు 70 శాతాన్ని డ్రోన్ వ్యవస్థల అభివృద్ధికే కేటాయించామని తెలిపారు.
2020 జూన్ లో తూర్పు లడఖ్ సమీపంలోని గాల్వాన్ వ్యాలీలో సంభవించిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా స్ట్రైక్ ట్రైనింగ్ కోర్సును రూపొందించామని శతృజీత్ చెప్పారు. 2027 చివరి నాటికి ప్రతి సైనికుడికి ఈ శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. సరిహద్దుల్లో భూగర్భ షెల్టర్లను నిర్మించడం, మైనస్ డిగ్రీల చలిలో వాహనాలు నడిచేలా కోల్డ్ స్టార్ట్ కిట్స్, ఇన్సులేటెడ్ బ్యారక్స్, సోలార్ వాటర్ హీటర్లను అమర్చుతున్నామని చెప్పారు.















Click it and Unblock the Notifications
