స్కూల్ బస్సుపై అల్లరిమూకల రాళ్ల దాడి: ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీరులో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. కనీస మానవత్వం లేకుండా విద్యార్థులు ప్రయాణిస్తున్న పాఠశాల బస్సుపై బుధవారం రాళ్ళతో దాడులకు దిగాయి.
షోపియాన్ జిల్లాలోని కానిపొర గ్రామంలో జరిగిన ఈ దాడిలో రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ళ విద్యార్థి తలకు తీవ్ర గాయం కాగా, మరో విద్యార్థి కూడా గాయపడ్డాడు. మిగిలిన విద్యార్థులంతా రాళ్ల దాడితో భయభ్రాంతులకు గురయ్యారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రెయిన్‌బో ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు దాడికి గురైనట్లు పోలీసులు చెప్పారు. ఈ బస్సులో 50 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. వీరంతా దాదాపు నాలుగేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసువారేనని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాధిత బాలుడి తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడిపై జరిగిన దాడి మానవత్వానికే మాయని మచ్చ అని అన్నారు. మరో చోట పర్యాటకుల బస్సుపైన అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. కాగా, ఈ దాడులను జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications