ఆర్మీ దుస్తుల్లో వచ్చి పోలీసులపై దాడి: తుపాకులు ఎత్తుకెళ్లారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధ రాత్రి టీవీ టవర్ వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పోలీసులపై దాడి చేసి ఐదు తుపాకులు ఎత్తుకెళ్లారు.
ఉగ్రవాదుల వరుస దాడులతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో హైఅలర్ట్ వాతావరణం నెలకొంది. పోలీసుల ఆయుధాలను దొంగిలించిన ఉగ్రవాదుల కోసం భారత సైనికులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్: సైనికుడి వీరమరణం
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు చాటుగా నక్కి కాల్పులు జరపడంతో భారత సైనికుడు సుదేశ్‌కుమార్ వీరమరణం చెందారు. జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సుదేశ్‌కుమార్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
అంతకుముందు ఉదయం కూడా పాక్ సైనికులు తేలికపాటు ఆయుధాలతో భారత శిబిరాలపై కాల్పులు దిగారు. దీనికి ప్రతిగా భారత దళాలు అదే రీతిలో స్పందించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపిన నాటి నుంచి 26 సార్లు పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఆదివారం ఒక్క రోజే 12 గంటల వ్యవధిలో రెండు సార్లు కాల్పులు జరిపింది.
ఇది ఇలా ఉండగా, బ్రిక్స్ సమావేశాల వేదికగా పాకిస్థాన్ ఉగ్రదేశమంటూ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులకు పాకిస్థాన్ తల్లిలా మారిందని అన్నారు. ఇకనైనా పాకిస్థాన్ తన మైండ్ సెట్ మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మోడీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications