ఉగ్రవాద దాడి: ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ సైనికాధికారి సహా 12 మంది మరణించారు. ఒకే బృందంగా బయలుదేరిన ఉగ్రవాదులు ముందుగా పోలీసు స్టేషన్ మీద, ఆ తర్వాత సైనిక శిబిరం మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు, ఓ సైనికాధికారి సహం 12 మంది మృతి చెందారు.
ఇరు పక్షాల మధ్య ఇంకా కాల్పులు చాలా సేపు కొనసాగాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇటీవల పాకిస్తాన్ నుంచి దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్లుగా ఆర్మీ వర్గాలు చెబుతున్నారు.

ముగ్గురు మిలిటెంట్లు కతువా జిల్లాలోని హీరానగర్ పోలీసు స్టేషన్‌కు ఆటో రిక్షాలో వచ్చారని, పోలీసు స్టేషన్‌పై దాడి చేశారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు ఇది కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మిలిటెంట్లు గ్రెనేడ్లు, ఆటోమేటిక్ ఆయుధాలతో హీరా నగర్ పోలీసు స్టేషన్‌పై గురువారం దాడి చేశారని చెబుతున్నారు. పోలీసు స్టేషన్‌పై దాడి తర్వాత ఉగ్రవాదులు డ్రైవర్‌ను కాల్చి చంపి ట్రక్కును తీసుకున్నారు.
ట్రక్కును నేరుగా సైనిక శిబిరంలోకి నడిపించి దాడి చేశారు. 12 మంది మరణించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ధ్రువీకరించారు. భారత, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చల ప్రక్రియను దెబ్బ తీయడానికే ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications