ఉగ్ర కాల్పులు: నలుగురు పోలీసులు మృతి
షోపియాన్: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీస్ వాహనాన్ని బాగుచేసుకునేందుకు వెళ్లిన పోలీసులపై విచక్షణారహితంగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
కాగా, చనిపోయిన పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. షోపియాన్‌లోని అర్హామా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది కాశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 30 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది ఇలా ఉండగా, అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులపై దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది.
ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ టాప్ కమాండర్ అల్తఫ్ అహ్మద్ దార్ హతమయ్యాడు. ఈ దాడికి ప్రతీకారంగానే పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఉంటారని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications