గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గురువారం రాత్రి కన్నుమూశారు. బాందా జైలులో ఉన్న ముఖ్తార్‌కు గుండెపోటు రావడంతో మెడికల్ కాలేజీకు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ అన్సారి చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో మౌ, గాజీపూర్, బందా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బందా మెడికల్ కాలేజీ వెలుపల భారీ సంఖ్యలో పారా మిలిటరీ బలగాలను మోహరించారు. ఈ ప్రాంతమంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఇటీవల, ముక్తార్ జైలులో ఉన్న సమయంలో కడుపు నొప్పి ఫిర్యాదుతో ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అనంతరం అదే రోజు డిశ్చార్జి అయ్యారు. ముఖ్తార్‌కు జైల్లో విషప్రయోగం జరిగిందని అతని సోదరుడు అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. అఫ్జల్ అన్సారీ మంగళవారం నాడు ఈ వ్యాఖ్యలు చేశారు.

"తనకు జైలులో ఆహారంలో విషపూరిత పదార్థం ఇచ్చారని ముఖ్తార్ చెప్పారు. ఇది రెండవ సారి జరిగింది. దాదాపు 40 రోజుల క్రితం కూడా అతనికి విషం ఇచ్చారు. ఇటీవల, మార్చి 19 లేదా మార్చి 22న ఆయనపై మళ్లీ విషప్రయోగం జరిగింది, ఇది అతని ప్రస్తుత పరిస్థితికి దారితీసింది' అని అన్సారి సోదరుడు ఆరోపించారు.
63 ఏళ్ల ముఖ్తార్ అన్సారీ.. మౌ సదర్ సీటు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2005 నుంచి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో కస్టడీలో ఉన్నారు. ఆయనపై 60కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. సెప్టెంబరు 2022 నుంచి వివిధ కోర్టుల ద్వారా ఎనిమిది కేసులలో శిక్షలు పడ్డాయి. దీంతో అతన్ని బందా జైలులో ఉంచారు. గతేడాది ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన 66 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితాలో అన్సారి పేరు కూడా ఉండటం గమనార్హం. ముఖ్తార్ అన్సారీని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారేమోనని అతని కుటుంబ సభ్యులు గతంలో ఆందోళనలు చేశారు.












Click it and Unblock the Notifications