ప్రేయసి మొబైల్ కోసం 'శంకర్ దాదా'గా మారిన యువకుడు
జైపూర్: ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రేయసికి బహుమతి కొనేందుకు ఓ యువకుడు శంకర్ దాదా (హిందీలో మున్నాబాయ్)గా మారాడు. అలా మారి అతను కటకటాల వెనక్కి వెళ్లాడు. రూ. 5 వేలకు ఆశపడి జైపూర్‌కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి శైలేంద్ర పరిహార్ మరో వ్యక్తి పేరు పరీక్ష రాయడానికి సిద్ధపడ్డాడు.
బుధవారంనాడు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లోని రెండో దశ వైద్య పరీక్షను మరో వ్యక్తి పేర రాయడానికి సిద్ధపడి ఆర్మీ అధికారులకు చిక్కాడు. అతన్ని వారు పోలీసులకు అప్పగించారు. ఫరుకాబాద్‌కు చెందిన మోను పాల్ తరఫున అతను పరీక్షకు హాజరయ్యాడు. వినికిడి సమస్య కారణంగా మోను పాల్ తాత్కాలిక అనర్హతకు గురయ్యాడు.
వినికిడి సమస్యను సరిచేసుకుని 4వ తేదీన రెండో దశ పరీక్షకు హాజరు కావాలని మెడికల్ బోర్డు చెప్పారు. తన వినికిడి సమస్యకు చికిత్స చేయించుకోవడానికి తన స్థానంలో మరో వ్యక్తిని పరీక్షకు పంపించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా తన గర్ల్‌ఫ్రెండ్‌కు మొబైల్ ఫోన్ కొనిచ్చే పరిస్థితి తనకు లేనందుకు పరిహార్ బాధపడుతున్నాడు. ఈ సమయంలో అతనికి జైపూర్‌లో పాతర మిత్రుడు గంగ్వార్ కలిశాడు.

గంగ్వార్ పరిహార్‌ను బరేలీకి ఆహ్వానించి, తన ఖర్చులతో సిటీ అంతా చూపిస్తానని చెప్పాడు. బరేలీకి చేరిన తర్వాత గంగ్వార్ అతనికి మోను పాల్‌ను పరిచయం చేశాడు. మోను పాల్ తరఫున పరీక్ష రాసి ఐదు వేలు తీసుకోవడానికి అతను అంగీకరించాడు. వైద్య పరీక్షల కోసం సైనిక ఆస్పత్రికి వెళ్లిన వెంటనే అధికారులు పరిహార్‌ను పట్టుకున్నారు. బయో మెట్రిక్ విధానాన్ని అనుసరించి అతను దొంగ అభ్యర్థి అని కనిపెట్టారు.
శైలేంద్ర పరిహార్ తొలుత తాను ఎవరనే విషయాన్ని చెప్పడానికి నిరాకరించాడు. పోలీసులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, టీవీలో ఫోటో చూసిన పరిహార్ సోదరుడు రావడంతో అతని అసలు విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications