జామియా కాల్పులు : విచారణలో షూటర్ ఆసక్తికర విషయాలు.. రూ.10వేలకు గన్
దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు మైనర్‌గా గుర్తించారు. అతని పదో తరగతి మార్కుల మెమో,ఆధార్ కార్డు ఆధారంగా అతన్ని మైనర్‌గా గుర్తించారు. అయితే కచ్చితమైన వయసు నిర్దారణ కోసం అతనికి బోన్ ఆసిఫికేషన్(ఎముకలకు సంబంధించిన పరీక్ష) టెస్టుకు అనుమతించాల్సిందిగా పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డ్(JJB)ని కోరారు. జువైనల్ బోర్డు అనుమతిస్తే.. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

సెల్ఫ్ రాడికలైజ్..
ఇక కస్టడీలో భాగంగా నిందితుడి నుంచి పోలీసులు పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. తన స్నేహితుడి దగ్గర రూ.10వేలకు గన్‌ను కొనుగోలు చేసినట్టు అతను విచారణలో వెల్లడించాడు. గన్ పట్టుకునే ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే ఎక్కువ లైక్స్ కూడా వస్తాయని అతను పోలీసులతో చెప్పడం గమనార్హం. ఇంతకుముందు తనకు గన్ ఉపయోగించిన అనుభవం కూడా లేదని అతను తెలిపాడు.
భజరంగ్‌దళ్ మద్దతుదారుడైన నిందితుడు.. తనంతట తానే రాడికలైజ్ అయినట్టు పోలీసులకు తెలిపాడు. గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణితో ఉండే పోస్టులను ఎక్కువగా ఫాలో అయినట్టు వెల్లడించాడు. ఆన్‌లైన్‌లో ప్రతీరోజూ ప్రసంగాలు వినేవాడినని,రెచ్చగొట్టే లేదా దాడికి సంబంధించిన ఉద్దేశంతో పోస్టులు పెట్టేవాడినని చెప్పాడు.

పశ్చాత్తపం లేదు..
నవంబర్,2019లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో జెవార్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోనూ పాల్గొన్నట్టు తెలిపాడు. తనంతట తానే జామియా వర్సిటీకి వెళ్లానని, కాల్పులు జరపాల్సిందిగా ఎవరూ తనను ప్రేరేపించలేదని చెప్పాడు. అంతేకాదు,జామియాలో తాను చేసిన దానికి.. ఏమాత్రం పశ్చాత్తాపం చెందట్లేదని తెలిపాడు. విచారణలో అతను వెల్లడించిన వివరాల ఆధారంగా అతని స్నేహితులు,కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఘటన జరగడానికి రెండు వారాల ముందు నుంచి అతని ప్రవర్తనలో తేడాను గమనించినట్టు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. కొన్నిసార్లు ఇంట్లోనూ,చుట్టుపక్కల నినాదాలు కూడా చేసినట్టు తెలిపారు.

సీఏఏకి మద్దతుగా ర్యాలీ కూడా చేపట్టాలనుకుని విఫలం..
జామియాలో కాల్పులకు ముందు అతను పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి మద్దతుగా ఒక ర్యాలీ కూడా చేపట్టాలని నిర్ణయించుకుని విఫలమైనట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. నిందితుడిని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నప్పటికీ.. పోలీసులు ఒకరోజు విచారణకే పరిమితమైనట్టు తెలుస్తోంది. మిగతా రోజుల్లో అతన్ని విచారించరని సమాచారం. మరోవైపు కాల్పుల్లో గాయపడ్డ జామియా విద్యార్థి షాదాబ్ ఫరూఖ్ శుక్రవారం మధ్యాహ్నం ఎయిమ్స్ నుంచి విడుదలయ్యాడు.

కాల్పుల ఉదంతం..
జామియా మిలియా యూనివర్సిటీలో గురువారం నిందితుడు కాల్పులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిపై అతను కాల్పులకు తెగబడ్డాడు.'మీకు స్వేచ్చ కావాలి కదా.. ఇదిగో తీసుకోండి..' అంటూ కాల్పులు జరిపాడు. జైశ్రీరామ్ అంటూ బిగ్గరగా నినాదాలు చేశాడు. కాల్పుల సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications