కాశ్మీర్ లో 31వ రోజు కర్ఫూ: ఢిల్లీలో సీఎం ముఫ్తీ
న్యూఢిల్లీ: కాశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమై చర్చించారు.
నెల రోజుల నుంచి కాశ్మీర్ లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఇదే సమయంలో రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు. కాశ్మీర్ లో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇదే సమయంలో నిర్ణయించారని సమాచారం.
సోమవారం ఉదయం మెహబూబా ముఫ్తీ ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ తో సమావేశమైనారు. ఈ సమావేశంలో కాశ్మీర్ పరిస్థితులపై సమీక్షించారు.

గత 31 రోజుల నుంచి కాశ్మీర్ లోయతో పాటు పలు ప్రాంతాల్లో కర్ఫూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వానిని భద్రతా దళాలు మట్టుబెట్టిన అనంతరం కాశ్మీర్ లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.
ఈ గొడవల్లో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. కాశ్మీర్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ నొరువిప్పడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఇప్పటికే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు.
కేంద్రం వెంటనే అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కాశ్మీర్ అంశంపై చర్చించి సమస్యను కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యాలని వామపక్ష నేత సీతారాం ఏచూరి చెప్పారు. మొత్తం మీద కాశ్మీర్ లో ఆందోళనలు అదుపు చెయ్యడానికి కేంద్రం సిద్దం అవుతున్నది.












Click it and Unblock the Notifications