జమ్మూ కాశ్మీర్: బీజేపీ-పీడీపీ దోస్తీపై ఉత్కంఠ, గవర్నర్ పాలన దిశగా...
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పాలన దిశగా సాగుతోందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు వారాలు గడుస్తున్నా ఇంత వరకూ ఏ పార్టీ కూడా సర్కార్ ఏర్పాటుకు ముందుకు రాలేదు.
అత్యధిక స్థానాలు గెలుచుకున్న పీడీపీ, రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీల మధ్య మంతనాలు జరిగినా అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరో పది రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు ముగియబోతోంది. వ్యక్తిగత పర్యటనపై ఢిల్లీ వచ్చిన కాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోరా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించారు.

లండన్ నుంచి తిరిగొచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుపై మిగతా పార్టీలతో మంతనాలు జరుపుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా భువనేశ్వర్‌లో స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అంతర్గత చర్చలు ఇంకా ఓ కొలిక్కిరాలేదని పీడీపీ వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ, పీడీపీల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీల మధ్య స్నేహం చిగురించిందని, ప్రభుత్వం ఏర్పడుతుందనే ప్రచారం సాగింది. అయితే, ఆ చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటా లేక గవర్నర్ పాలనా అనే దానిపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications