పోలీసులంతా అమ్మ ఆసుపత్రి చుట్టే.. జనాలకు ఇక్కట్లు తప్పట్లేదు
చెన్నై : అమ్మ అనారోగ్యం కారణంగా.. అమ్మ అభిమానులు ఎంతగా ఆవేదన చెందుతున్నారో.. అంతకంటే ఎక్కువగా చెన్నై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారణం.. పోలీసు ఠాణాల్లో ఉండాల్సిన పోలీసులంతా ప్రజలకు అందుబాటులో లేకుండా.. అమ్మ చికిత్స పొందుతోన్న అపోలో ఆసుపత్రి చుట్టు పహారా కాస్తుండడమే.
బందోబస్తు కోసం ఎక్కువ మంది పోలీసులను అపోలో ఆసుపత్రి చుట్టే మోహరించడంతో.. ప్రజలు తమ ఫిర్యాదులు విన్నవించుకోవడానికి వెళ్తే.. పోలీస్ స్టేషన్లలో పోలీసులే లేని పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా టీ నగర్ కు చెందిన మహావీర్ చంద్ ధోకా అనే వ్యక్తి చీటింగ్ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా.. తన ఫిర్యాదును స్వీకరించడానికి కూడా అక్కడ పోలీసులు ఎవరు లేరని వాపోయినట్లుగా సమాచారం.

దీంతో ఏంచేయాలో పాలుపోక.. ఏకంగా సిటీ కమిషన్ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు దాఖలు చేసుకున్నాడు మహావీర్ చంద్. అన్నానగర్ కు చెందిన జయంతిది(80) కూడా ఇదే పరిస్థితి. ఇంట్లో చోరీ జరగడంతో.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలనుకుంది. తీరా స్టేషన్ కు వెళ్తే.. సీనియర్ పోలీస్ అధికారులెవరూ అందుబాటులో లేరని, వారంతా అపోలో ఆసుపత్రిలో బిజీ బిజీగా గడుపుతున్నారని వాపోయింది.
చెన్నై పరిధిలో ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్లంతా అపోలో ఆసుపత్రి వద్దే డ్యూటీ చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా, గతనెల 22 నుంచి సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ప్రస్తుతం చెన్నైలో సీనియర్ పోలీసులు సేవలు కరువైపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.












Click it and Unblock the Notifications