ఏం మాయ చేశారో: జయ కంటే శశికళకు క్రేజ్ పెరిగిందా ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆమె అభిమానులు మరిచిపోయే విధంగా నెచ్చెలి శశికళ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు కారణం అమ్మ సమాధి దగ్గర కన్నా ఇప్పుడు పోయెస్ గార్డెన్ లో శశికళను పరామర్శించే వారి సంఖ్య ఎక్కువ రెట్టింపు అయ్యింది.
మెరినా బీచ్ లోని అమ్మ సమాధి దగ్గర ఐదు వేల మంది అభిమానులు ఉంటే పోయెస్ గార్డెన్ లో శశికళను పరామర్శించే వారి సంఖ్య రెండింతలు ఎక్కువగానే ఉంది. ఇప్పుడు తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు చిన్నమ్మా మీరే దిక్కు అంటూ ఆమె కాళ్లమీద పడిపోతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాల నుంచి పోయెస్ గార్డెన్ లో ఉన్న విషయం తెలిసిందే. పోయెస్ గార్డెన్ లోని జయలలిత నివాసం ఉంటున్న వేదా నిలయంలో ఒక్క సారైనా అడుగు పెట్టాలని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆశగా ఉంటుంది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న జయలలిత ఇంటిలో సామాన్యంగా ఎవ్వరినీ అనుమతించరు, పార్టీ నాయకులైనా సరే అనుమతి ఉండాలి, లేదా అత్యవసరవ పరిస్థితి అయినా ఉండాలి. లేకుంటే భద్రతా సిబ్బంది అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తారు.
అది నిన్నటి మాట. అమ్మ మరణించిన తరువాత పోయెస్ గార్డెన్ లోని వేదా నిలయంలో జయలలిత నెచ్చెలి శశికళ నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే నాయకులు నేరుగా వేదా నిలయంలోకి వెళ్లి శశికళను పరామర్శిస్తున్నారు.
కార్యకర్తలు వేదా నిలయం గుమ్మం ముందు క్యూకడుతున్నారు. ప్రతి రోజూ కొన్ని వేలమంది శశికళను ఓదార్చడానికి, పరామర్శించడానికి వస్తున్నారు. నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూ కన్నా, జయలలిత సమాధిని దర్శించుకోవడానికి వచ్చే వారి సంఖ్య కన్నా ఇప్పుడు పోయెస్ గార్డెన్ లోని వేదా నిలయం ముందు శశికళను పరామర్శించడానికి క్యూ ఎక్కువగా ఉంది.

ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పరామర్శలు హోరెత్తుతుండటంతో భద్రతా సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గురువారం తమిళ సినీనటులు, అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధులు సీఆర్ సరస్వతి, రామరాజన్, గుండు కల్యాణం, సెంథిల్ శశికళను కలుసుకున్నారు.
రియో పారాలింపిక్ లో పతకం సాధించిన తమిళ తంగం మారియప్పన్ తంగవేలు తన కోచ్ సత్యనారాయణతో పోయెస్ గార్డెన్ చేరుకుని శశికళను కలుసుకుని బంగారు పతకాన్ని చిన్నమ్మకు చూపించారు.
బంగారు పతకం సాధించిన సమయంలో తమిళ తంగం మారియప్పన్ తంగవేలుకు రూ. రెండు కోట్లు నగదు బహుమానం ప్రకటిస్తున్నామని జయలలిత చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ నగదు తన చేతికి అందలేదని తంగవేలు చిన్నమ్మ ముందు వాపోయాడు.
ఇప్పుడు చిన్నమ్మ అయినా బహుమతి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని తంగవేలు ఆశలు పెట్లుకున్నాడు. ప్రతి రోజు పోయెస్ గార్డెన్ లో వేదా నిలయంలో శశికళను పరామర్శించడానికి వచ్చే వారి సంఖ్య అధికం కావడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications